అమరావతి : ప్రజాస్వామ్యం బలపడటంలో న్యాయ వ్యవస్థ అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లా కోర్టు 222 ఏళ్ల వేడుకలతో పాటు రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించాయి శనివారం. ఈ సందర్బంగా ఈ రెండు బార్ అసోసియేషన్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు సీఎం. రాజమండ్రి బార్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కోర్టులు సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయని ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ లాగే రాజకీయ ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థ కూడా ప్రజల హక్కుల కోసం అదే స్థాయిలో పనిచేస్తోందని చెప్పారు. రాజమహేంద్రవరం ఓ చారిత్రక ప్రదేశం. ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి మహోన్నతులు ఈ ప్రాంతాన్ని పునీతం చేశారని మరోసారి గుర్తు చేశారు.
ఆనాడు ఆర్థర్ కాటన్ లాంటి వారు బ్యారేజి కట్టి ఉభయ గోదావరి జిల్లాల డెల్టాను సస్యశ్యామలం చేశారు. ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా మార్చారని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి అవుతోందని ప్రకటించారు. గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. సీఎంగా మూడోసారి ఈ వేడుకను నిర్వహించే భాగ్యం దక్కిందన్నారు. సుప్రీం కోర్టు, ఏపీ హైకోర్టు న్యాయ మూర్తులందరినీ పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించాలని ఆహ్వానిస్తున్నానని తెలిపారు . టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి న్యాయవాదులు స్వాంతంత్ర్య సమర యోధుడిగా బ్రిటీష్ వారికి గుండెలు చూపించిన అపర ధైర్యశాలి అని అన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్లో ప్రాక్టీస్ చేసిన వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు 9వ భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారని చెప్పారు సీఎం.
ప్రజాకోర్టుగా పేరున్న సీతానగరం రచ్చబండ కోర్టు 1849లోనే అధికారిక కోర్టుగా పేరు పొందిందని చెప్పారు. తాటి చెట్ల ఆకుల తీర్పు ప్రతుల నుంచి ఏఐ వరకూ న్యాయ వ్యవస్థ రూపాంతరం చెందిందని అన్నారు. . సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోతారని పేర్కొన్నారు. అప్పటి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పు ఏపీని, అమరావతిని కాపాడిందని కొనియాడారు. . ఏపీకి తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రపుటల్లోకి ఎక్కారన్నారు..చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కూడా త్వరలోనే అమలు అయ్యే అవకాశం ఉందన్నారు. న్యాయం అందరికీ చేరువగా ఉండాలనే మన రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నారు.
