న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ తీసుకు వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి కుమార స్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీ వచ్చానని చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఓ దశకు చేరుకుంటున్నాయని అన్నారు సీఎం.
డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచు కోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుత డీలిమిటేషన్ ప్రక్రియతో 50 శాతం మేర సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. 1971, 2011, 2026 సెన్సెస్ ప్రకారం ముందుకు వెళ్తే దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయన్నారు. గతంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించాయని తెలిపారు. నేను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ ప్లానింగ్‌పై గట్టిగా పనిచేశాం. ఓ క్యాంపెయిన్ మోడ్‌లో పనిచేసి జనాభా నియంత్రణను సాధించగలిగాం. ఫెర్టిలిటీ రేటును తగ్గించగలిగాం అన్నారు సీఎం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అనే విధానాన్ని అమలు చేసి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం అని చెప్పారు సీఎం.
