హైదరాబాద్ : అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ తెలిపారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు త్వరలో ప్రారంభమవుతాయని, ఇది ప్రజలకే అంకితం చేయబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి అవిభక్త వరంగల్ జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్య సేవలు, ఆసుపత్రుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రజారోగ్య సంచాలకులు రవీందర్ నాయక్, వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి, డీసీహెచ్ఎస్ రామమూర్తి, హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య, డీసీహెచ్ఎస్ నారాయణరెడ్డి, మహబూబాబాద్ డీఎంహెచ్ఓ రవి రాథోడ్, డీసీహెచ్ఎస్ సిహెచ్ రమేష్, జనగాం డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీసీహెచ్ఎస్ సంధ్య, ములుగు డీఎంహెచ్ఓ గోపాల్ రావు, డీసీహెచ్ఎస్ జగదీష్, జయశంకర్ భూపాలపల్లి డీఎంహెచ్ఓ మధుసూదన్, డీసీహెచ్ఎస్ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు.
వరంగల్, హనుమకొండతో సహా పలు జిల్లాల్లోని సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులలో డాక్టర్ల హాజరు తక్కువగా ఉందని గమనించిన మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిసిహెచ్ఎస్లను ఆదేశించారు. 90 శాతం వైద్య సేవలను స్థానికంగా అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు కీలకమని, వాటి పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని దామోదర రాజనరసింహ అన్నారు. ఇటీవల సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులకు సుమారు 1,616 మంది డాక్టర్లను నియమించినట్లు మంత్రి గుర్తు చేశారు. ఆసుపత్రులకు అవసరమైన అన్ని హెచ్ఆర్, పరికరాలు, మందులు, రీఏజెంట్లను ప్రభుత్వం అందిస్తోందని, అవసరమైన మరేదైనా అందించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. అవసరమైన ప్రతిపాదనలను సీనియర్ అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని మంత్రి సూచించారు.
ఆకస్మిక తనిఖీల కోసం హైదరాబాద్ నుంచి సీనియర్ అధికారులను పంపుతామని, వైద్య సంరక్షణ అందించడంలో రోగులను నిర్లక్ష్యం చేసినట్లయితే, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్పైనే కాకుండా జిల్లా డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓలపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అవిభక్త వరంగల్ జిల్లాల్లో సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, హీమోఫిలియా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ సమస్యపై జిల్లా స్థాయి ఆరోగ్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. ఈ వ్యాధులను నిర్మూలించేందుకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన వారిని ఆదేశించారు.
