అమరావతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటువంటి పార్టీతో రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. వైసీపీ నేర ప్రవృత్తి, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచాల్సిన బాధ్యత మీడియా పైనా ఉందన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి శనివారం వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. వైసీపీకి రాజకీయ పార్టీ లక్షణాలు, ఆ పార్టీ అధినేతకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లేవని సీఎం అన్నారు. అందుకే తాను ఆ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నానని, వైసీపీ చరిత్ర అంతా రక్త చరిత్రేనని పేర్కొన్నారు. వైసీపీ పోకడలు, వారి ప్రవృత్తిని చూసిన ఎవరికైనా ఇది అర్థమవుతుందని వివరించారు.
జగన్ రెడ్డి, ఆయన కుటుంబం వల్ల అనేక మంది ఐఏఎస్లు బలయ్యారని, వ్యాపారవేత్తలను నాశనం చేశారని దుయ్యబట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ పెట్టుబడులు పెట్టేవారిని బెదిరిస్తూ పరిశ్రమలు తరిమేస్తామని చెప్తున్నారని, పరిశ్రమలు వచ్చి ఉపాధి కల్పన జరిగితే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భయపడుతున్నారని అన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తైందని, పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు సీఎం… ఈ నేపథ్యంలోనే గొడ్డలి పార్టీలో టెన్షన్ మొదలైందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ అరాచకాలపై సమాజంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. సొంత ప్రయోజనాలు, భూములు కొట్టేసే కుట్రలో భాగంగా రైతుల భూములను 22ఏలో పెట్టి ఇబ్బందులు గురి చేశారని, వాటిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని అన్నారు. 22ఏలో పెట్టిన కారణంగా గత ప్రభుత్వంలో రైతులు కనీసం యూరియా తెచ్చుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయిందన్నారు.
