తిరుపతి : చంద్రగిరిలోని శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవోపేతంగా మహాలక్ష్మి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడారు. టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల మన్ననలు పొందుతోందన్నారు. భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం అందిస్తోందని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలను పొందడం ఆనంద దాయకమన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దేశ విదేశాల్లోని కోట్లాది మంది భక్తులు సైతం దివ్యానుభూతిని పొందారని పేర్కొన్నారు.
టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖశాంతులు, ఐశ్వర్యాలతో జీవించాలని సంకల్పించి టీటీడీ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజ భక్తుల్లో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంపొందిస్తోందని తెలిపారు. టీటీడీ చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆలయ వైభవాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం, టీటీడీ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. మహిళలు విశేషంగా పాల్గొనడం ఆనందదాయకమని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు భక్తి భావాన్ని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ దీపం జ్ఞానానికి, శుభానికి, ఐశ్వర్యానికి ప్రతీక అని తెలిపారు. శ్రీ మహాలక్ష్మీ దీప పూజ ద్వారా ప్రతి ఇంటా సుఖశాంతులు, ఐశ్వర్యం, సమృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, దీపలక్ష్మీ ఆరాధన, అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, లక్ష్మీ స్తోత్ర పారాయణాలు, వేలాది దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణం దివ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది . అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమం ముగింపులో నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ మహాలక్ష్మీ దీప పూజకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసి, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది.
