బ‌తుక‌మ్మ‌కుంట ముమ్మాటికీ చెరువే – క‌మిష‌న‌ర్

కోర్టు తీర్పు మేర‌కు గేట్లు, బోర్డుల‌ను తొల‌గించాం

హైద‌రాబాద్ : అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట ముమ్మాటికీ చెరువే అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి శాటిలైట్, గూగుల్ మ్యాప్స్‌తో చారిత్ర‌క ఆధారాల‌ను చూపించారు. హైడ్రా కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఇటీవ‌ల హైడ్రా చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. బ‌తుక‌మ్మ కుంట గురించి ప‌లు వార్త‌లు, వ‌దంత‌లు ప్ర‌సారం కావ‌డంతో వివ‌ర‌ణ ఇచ్చారు. 1975లో ఇరిగేష‌న్ రికార్డుల్లో కుంట‌గా పేర్కొన్న ఆధారాల‌ను చూపించారు. స‌ర్వే నంబ‌రు 563/1 లో 9.19 ఎక‌రాల వ‌ర‌కూ చెరువున్నట్టు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ రికార్డులు వెల్ల‌డించాయ‌న్నారు. ఆ చెరువుకు క‌ట్ట 563/2 స‌ర్వే నంబ‌రులో 6 గుంట‌ల మేర మాసాన్ క‌ట్ట పేరిట ఉంద‌న్నారు. గ్రామ రికార్డుల‌తో పాటు.. 1971లో స‌ర్వే ఆఫ్ ఇండియా ఫొటోలు, 1989లో నాసా (ల్యాండ్‌శాట్‌) రూపొందించిన శాటిలైట్ పిక్ష‌ర్స్‌ను మీడియాకు విడుద‌ల చేశారు.

ఈ ఫొటోలు, వీడియోల‌ను స‌రిపోల్చుతూ రూపొందించిన వీడియోను ప్ర‌ద‌ర్శించారు. బ‌తుక‌మ్మ కుంటపై తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కూ దీనిమీద ఎవ‌రూ ఓన‌ర్‌షిప్‌ క్లెయిమ్ చేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌ల మేర‌కు బోర్డులు, గేట్లు తొల‌గించామ‌ని చెప్పారు. చెరువు చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తొల‌గిస్తే ప్ర‌మాదాలు జ‌రుగుతాయ‌ని సుప్రింకోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా తెలిపామ‌న్నారు. వివ‌ర‌ణ‌తో 3 వారాల్లో అఫ‌డ‌విట్‌ను దాఖ‌లు చేయ‌మ‌ని సుప్రిం కోర్టు సూచించింద‌ని తెలిపారు. బండ్ల‌గూడ మండ‌లం, విలేజ్‌లోని స‌ల్కం చెరువు విష‌యంలో కూడా కోర్టు హైడ్రాను త‌ప్పు ప‌ట్ట‌లేద‌నే విష‌యాన్ని గుర్తు చేశారు. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన వివ‌రాలు హైడ్రా కోరిన విష‌యాన్ని కూడా హైకోర్టు తీర్పులో పేర్కొంద‌ని.. ఇరిగేష‌న్‌, రెవెన్యూ నుంచి వ‌చ్చిన నివేదిక మేర‌కు చ‌ర్య‌లుంటాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!