అమరావతి : ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీ నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. ఉచిత విద్యుత్ పథకం అమలులో భాగంగా తొలి నెలలో జీరో పేమెంట్ విద్యుత్ బిల్లు రావడంతో చేనేతలు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారని అన్నారు మంత్రి ఎస్. సవిత. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. ఒకవైపు చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా, గత నెల ఒకటో తేదీ నుంచి చేనేతలకు మేలు కలిగేలా కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా లక్షా నాలుగు వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందజేసేలా చర్యలు చేపట్టింది.
మగ్గంపై నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గంపై నేసే నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉచిత విద్యుత్ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఒకవైపు చేనేత రంగ అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తూనే, నేతన్నలకు వ్యక్తిగత లబ్ధి కలిగించేలా పథకాలు అమలు చేస్తోంది. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు రూ.4 వేల చొప్పున పెన్షన్ అందజేస్తోంది. ఏటా రూ.5 కోట్ల మేర త్రిఫ్ట్ ఫండ్ నిధులు కేటాయిస్తోంది. నూలుపై 15 శాతం సబ్సిడీ అందజేస్తోంది. ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తోంది. ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేనేత ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తోంది. 2,640 మంది చేనేత కార్మికులకు ముద్ర పథకం కింద రూ.24.43 కోట్లు అందచేసింది.
