ఎన్జీటీ, ఈసీ రూల్స్ కు లోబ‌డే నిర్మాణాలు చేప‌ట్టాలి

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త బోలిశెట్టి స‌త్య నారాయ‌ణ డిమాండ్

అమ‌రావ‌తి : ప‌ర్యావ‌ర‌ణ , సామాజిక కార్య‌క‌ర్త‌, మాజీ జ‌న‌సేన నేత బోలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌త్యేకించి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాల‌పై ప్ర‌స్తావించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు, పర్యావరణ అనుమతుల (ఈసీ) నిబంధనలకు లోబడే అమరావతి రాజధాని నిర్మాణం జరగాలని అన్నారు. ఇవాళ బోలిశెట్టి మీడియాతో మాట్లాడారు. లేదంటే భవిష్యత్తులో హైడ్రా వంటి చట్టాల వల్ల కూల్చ బడతాయ‌న్నారు. పర్యావరణ చట్టాల అమలు ప్రజాధనానికి రక్షణ, రాజధాని సమగ్రతకు ముప్పు కలగకుండా చూడాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వంపైనే ఉందని స్ప‌ష్టం చేశారు.

అమరావతి రాజధాని నగర నిర్మాణం వేగవంతం కావడం స్వాగతించదగ్గ పరిణామం అయినప్పటికీ, ఈ మొత్తం అభివృద్ధి ప్రక్రియ గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు , అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ మంజూరు చేసిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి జరగాలని పేర్కొన్నారు బోలిశెట్టి స‌త్య‌నారాయ‌ణ‌. పర్యావరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం అనేది కేవలం ఒక సంప్రదాయ ప్రక్రియ కాదు, అది అమరావతి రాజధానికి సంబంధించి చట్టపరమైన సమగ్రతను కాపాడటానికి, భవిష్యత్తులో న్యాయ పరమైన చిక్కుల వల్ల ప్రజాధనం వృధా కాకుండా చూసేందుకు ఒక యాంత్రిక అవసరం అని అన్నారు. అది విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు ఒక భరోసా ఇస్తుంద‌న్నారు.

ప్రభుత్వం , సీఆర్‌డీఏ నియమించే పర్యవేక్షణ కమిటీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నదీ తీర ప్రాంతాలలో లేదా వాగుల బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలూ, పర్యావరణ ఉల్లంఘనలూ జరగకుండా కఠినమైన యాంత్రిక నిఘా ఉంచాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!