కార్మికులకు ఖుష్ కబర్ వేతనాలను పెంచిన సర్కార్
సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. కనీస వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. తద్వారా వారికి ఎంతో అవసరమైన ఆర్థిక ఉపశమనాన్ని కల్పించింది. గురువారం సీఎం మీడియాతో మాట్లాడారు. కార్మికుల కనీస వేతనాల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన తెలిపారు.
గత బీఆర్ఎస్ పాలనలో, కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించక పోవడం వల్ల ఏకంగా 1.11 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కనీస వేతనాల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి, కీలక సిఫార్సులు చేసిందన్నారు. ఈ కమిటీ కార్మికులను నైపుణ్యం లేనివారు , పాక్షిక నైపుణ్యం ఉన్నవారు, నైపుణ్యం ఉన్నవారు, అత్యంత నైపుణ్యం ఉన్నవారు అనే విభాగాలుగా విభజించిందని తెలిపారు సీఎం. కార్మికుల వేతనాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రాంతాలను మూడు జోన్‌లుగా విభజించిందన్నారు.. జోన్-1లో మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్-2లో మున్సిపాలిటీలు , జోన్-3లో గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయన్నారు. జోన్-1లో, నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను రూ. 12,750 నుండి రూ. 16,000కు, పాక్షిక నైపుణ్యం ఉన్నవారి వేతనాలను రూ. 13,592 నుండి రూ. 17,000కు, నైపుణ్యం ఉన్నవారి వేతనాలను రూ. 13,772 నుండి రూ. 18,500కు, అత్యంత నైపుణ్యం ఉన్నవారి వేతనాలను రూ. 14,607 నుండి రూ. 20,000కు పెంచామన్నారు సీఎం.