జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్

వెల్ల‌డించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైద‌రాబాద్ : ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లోని తన చాంబర్‌‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యానారాయణ, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆరోగ్యశాఖ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కలిగే ప్రయోజనాలపై సమావేశంలో చర్చించారు.

హైదరాబాద్‌ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన సూచనలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇకపై ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్‌ను నిర్వహించాలని అన్నారు. ఇందుకు అనుగుణంగా ఈ ఏడాది జూన్‌లో మొదటి ఈవెంట్ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఈవెంట్‌లో దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను భాగస్వాములు అయ్యేలా ప్ర‌య‌త్నించాల‌న్నారు. మెడికల్ టూరిజంలో ఉన్న ప్రైవేటు సంస్థలను సైతం ఈవెంట్‌లో భాగస్వామ్యం చేయాలని స్ప‌ష్టం చేశారు ఆఫ్రికా, ఏసియా, మిడిల్ ఈస్ట్‌ తదితర కంట్రీస్ నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో పాటు.. నిమ్స్‌, టిమ్స్‌, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల సందర్శనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

Leave A Reply

Your Email Id will not be published!