అమరావతి : ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ది రాలేదన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సొంత ఇంటి నుంచే వెన్నుపోటు ప్రారంభించిన జగన్ వెన్నుపోటు దినానికి కేరాఫ్ అడ్రస్ గా మారారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కన్న తల్లి, సొంత చెల్లి నుంచే జగన్ వెన్నుపోటు మొదలైందంటూ ఎద్దేవా చేశారు వాసం శెట్టి సుభాష్. బాబాయ్ కి వెన్నుపోటు తో పాటు గొడ్డలి పాటు వేయించి గండ్ర గొడ్డలి పార్టీగా పేరు తెచ్చారని అన్నారు. పేర్ని నాని, కొడాలి నానిల పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మానసిక స్థితికి మందుల డోస్ పెంచితే ఏం ప్రమాదం ఉంటుందో అనే భయం వైద్యుల్లో ఉందన్నారు వాసం శెట్టి సుభాష్. నరం లేని నాలుక ఎటైనా తిరిగే జగన్ కు అప్పుడప్పుడు కరెంట్ షాక్ లాంటి చికిత్స అవసరం అని అభిప్రాయపడ్డారు. జగన్ ప్రెస్ మీట్ అంటే కాసేపు నవ్వుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్ గా ఫీలవుతున్నారని పేర్కొన్నారు కార్మిక శాఖ మంత్రి. పేకాట క్లబ్ లు, క్యాసినోలు ఆడించే బ్యాచ్ కు బ్రిడ్జ్ కోర్సు గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అపహాస్యం పాలయ్యే వింత కార్యక్రమాలు వైసీపీ చేపడుతోందన్నారు. కోటి సంతకాలు అన్న వాళ్ళకి ప్రజా మద్దతు లేక పోవటంతో పెట్టిన సంతకాలు మళ్లీ మళ్లీ పెట్టేందుకు వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారని చెప్పారు.
