అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా నిలకడైన వృద్ధి నమోదు చేస్తోంది. ఈ విషయాన్ని గత జూలై 2026 నెలవారీ ఆర్ధిక నివేదిక స్పష్టం చేస్తోంది. గడచిన రెండేళ్లుగా జాతీయ వృద్ధి రేటు కంటే ఏపీ వృద్ధిరేటు మెరుగ్గా నమోదు అవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వాస్తవ వృద్ధి రేటు 2023-24లో 6.5 శాతం నమోదు చేస్తే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9.9 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అవుతున్నట్టు నెలవారీ ఆర్ధిక నివేదిక పేర్కొంది. ఈమేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రణాళికా విభాగం అధికారులు 2026 జూలై ఆర్ధిక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. 2025-26 రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగం 13.5 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక రంగం 10.6 శాతం మేర, సేవా రంగం 9.9 శాతం వృద్ధితో ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచాయి.
పశుసంవర్ధక శాఖలో మాంసం ఉత్పత్తి 9.6 శాతం, గుడ్ల ఉత్పత్తి 5.1 శాతం వృద్ధిని సాధించాయి. సేవా రంగంలో ఐటి, రవాణా, వాణిజ్య కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణ ఎగుమతుల్లో రూ. 16,322 కోట్లతో 10.5 శాతం మేర వృద్ధి నమోదు అయ్యింది. ఎస్టిపిఐ (STPI) ఎగుమతులు 32.2 శాతం మేర పెరిగాయి, అలాగే వాణిజ్య వాహనాల నమోదు 51.6 శాతం వృద్ధిని కనబరిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెక్నాలజీ ఇంటిగ్రేషనుతో జీఎస్టీ పన్ను వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.13,282 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కూడా ఆశాజనకంగా ఉంది. రూ. 2.88 లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టుల పెట్టుబులు గ్రౌండింగ్ తో 75.4 శాతం మేర, రూ. 60 వేల కోట్ల మేర ఎంఎస్ఎంఈ రంగ పెట్టుబడులు 73.6 వృద్ధిని నమోదు చేశాయి. పన్ను, పన్నేతర ఆదాయాల్లో గణనీయంగా వృద్ధి నమోదు అయ్యింది. ఫలితంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది.
