న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆప్ ఆరోపణలు చేసిన విధంగానే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఆప్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు మరో ఆరుగురు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆప్ రాజ్యసభ ఎంపీలలో మూడింట 2/3 వంతు మంది కూడా విలీనం అవుతున్నారని అన్నారు. రాఘవ్ చద్దా ద్రోహం చేశారని ఆప్ ఆరోపించింది. ఇదిలా ఉండగా సరైన సమయంలో పంజాబ్, భారతదేశ ప్రజలు సమాధానం చెబుతారని పేర్కొంది.
ఎంపీలలో అధిక శాతం మందితో పాటు తాను కూడా బీజేపీలో చేరనున్నట్లు రాఘవ్ చద్దా ప్రకటించారు. కొన్ని వారాల క్రితం తనను పదవీచ్యుతుడిని చేసిన పార్టీ అధినేత, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది పెద్ద దెబ్బ అని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు ఆప్ కు రాజ్యసభలో 10 మంది ఎంపీల బలగం ఉంది. దాదాపు 7 మంది బీజేపీలోకి జంప్ కానున్నారు. అవినీతిపై సయోధ్య కుదుర్చుకుంటామని హామీలిచ్చి ఒకప్పుడు ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు నిజాయితీ రాజకీయాలకు దూరమవుతోందని రాఘవ్ చద్దా ఆరోపించారు. తాము సంతకం చేసి రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి కి పంపించామన్నారు. కాగా బీజేపీలో విలీనమవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మాలివాల్ ఉన్నారని ఆయన తెలిపారు. వీరితో పాటు రాజిందర్ గుప్తా, విక్రమ్ సహానీ, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌ల పేర్లను కూడా ప్రస్తావించారు.
