ఆర్టీసీ సిబ్బంది సానుకూల వైఖ‌రి క‌లిగి ఉండాలి

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తో కలిసి ఉన్నతాధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కింది స్థాయి సిబ్బందిపై అధికారులు వేధింపు ధోరణితో కాకుండా స్నేహపూర్వక వాతావరణం లో పని చేయాలని మంత్రి సూచించారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తించకుండా, ఆప్యాయతతో , స్నేహ పూర్వక వాతావరణంలో వారి ద్వారా పనులు చేయించు కోవాలని అన్నారు.

ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సిబ్బంది సమస్యలను నేరుగా వినేందుకు ప్రతి నెల రెండో మంగళవారం అన్ని డిపోలలో ఫిర్యాదుల పరిష్కార సమావేశాలను (Grievance Meetings) తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, మే 17వ తేదీలోగా అన్ని డిపోలు , బస్ స్టేషన్లలో ప్రాథమిక సౌకర్యాలను మెరుగు పరచాలని డిపో మేనేజర్లను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతి, పచ్చదనం , పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. టికెటింగ్ విషయంలో తలెత్తే సమస్యలను సామరస్యంగా పరిష్కరించు కోవాలని, సిబ్బందితో వాగ్వాదాలకు దిగడం సరికాదని పేర్కొన్నారు.

అదేవిధంగా డిసెంబర్ 9, 2023న ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం విజయవంతంగా కొనసాగుతోందని గుర్తు చేస్తూ, ప్రజా ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని డిపో మేనేజర్లకు దిశానిర్దేశం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!