హైదరాబాద్ : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని దుస్సాహసాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కమ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టుతుందని, థర్డ్ డిస్కమ్ రైతుల పాలిట మరణశాసనం అని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. అప్పులతో పుట్టిన డిస్కమ్ సేవలు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. తెలంగాణ ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో “రైతు డిస్కమ్ (మూడో డిస్కమ్) – ప్రకటిత లక్ష్యాలు – ఆచరణ సవాళ్లు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి . ఈ సందర్బంగా మాట్లాడుతు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కమ్ భవిష్యత్‌లో రైతుల పాలిట మరణ శాసనంగా మారే ప్రమాదం ఉందన్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటు విషయం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతాంగానికి అవగాహన లేదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ నుంచి అనుమతులు లేక ముందే ముఖ్యమంత్రి జూన్ 2న రైతు డిస్కమ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు.
గతంలో తమ పాలనలో రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైతే తాము అడ్డుకున్నామని, శాసనసభ ఏర్పాటు చేసి తీర్మాణం చేసి కేంద్రానికి పంపించామని చెప్పారు. దాని ఫలితంగా కేంద్రం మనకు రావాల్సిన 23 వేల కోట్ల రూపాయల అప్పులను రాకుండా అడ్డుకుందన్నారు. కానీ ప్రభుత్వం ఎవరి అభిప్రాయం లేకుండానే ఏక పక్షంగా మూడవ డిస్కమ్ ఏర్పాటు చేసి రైతులను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగుల విభజన తీరు గమనిస్తే సుమారుగా 600 డీటీఆర్లను ఒకరు చూడాలంటే సాధ్యమా అని ప్రశ్నించారు. నాలుగు డీటీఆర్లు ఒకేసారి కాలిపోయినా, సమస్య వచ్చినా దానిని సదరు ఉద్యోగి పరిశీలించడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందన్నారు. అంత వరకు రైతుల పరిస్థితి ఎమిటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మండలానికి పది నుంచి పదిహెను మంది సిబ్బంది ఉంటేనే ఇబ్బందులు ఎదురయ్యాయని, ఒక్కనికి 600లకు పైగా డీటీఆర్‌ల నిర్వహణ అసాధ్యమని అన్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారని, కనీసం అసెంబ్లిలో కూడా చర్చించకుండా ఏక పక్ష నిర్ణయం తీసుకోవడమేమిటని ధ్వజమెత్తారు.