విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను ముంచడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెంబర్ వన్ అని మండిపడ్డారు. దోచడంలో మోడీని మించినోళ్లు లేరన్నారు. పెట్రోల్, డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతికి తెర లేపిందన్నారు. 10 రోజుల్లో వరుసగా 4 సార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం అన్నారు. కేవలం యుద్దం పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. అంబానీ, అదానీ కంపెనీలకు మేలు చేకూర్చేందుకు కుట్రకు తెర లేపాడని ఫైర్ అయ్యారు షర్మిలా రెడ్డి. రోజుకి వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ ఆకలి తీరడం లేదన్నారు. ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి, దేశ ప్రజలకు బ్రతుకు భారం చేసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు.
ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి, అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోడీకే చెల్లిందన్నారు. ఇంధన ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలుగా మిగిలి పోయాయని, కానీ మోదీ వచ్చాక నేర్చుకోవడం మానేసి పన్నుల విధింపు మాత్రమే చేస్తున్నాడని ఆరోపించారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని, పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం, రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారని గుర్తు చేశారు. నేడు నష్టాల పేరు చెప్పి మొత్తం భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీజీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం తప్ప మరోటి కాదన్నారు. చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది, ధరలు పెరిగాయని జనాలను వాయించడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు పాల్పడడం భావ్యం కాదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.