హైదరాబాద్ : తాను ఏది చెప్పానో దానిని చేసి చూపించానని, భవిష్యత్తులో కూడా తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని ప్రకటించారు ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన కాన్ క్లేవ్ లో ఆయన మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను ప్రతీకార చర్యలకు తీసుకోనని ఆ లక్షణం తనకు లేదన్నారు సీఎం. అలా అనుకుని ఉంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను జైల్లో వేసేవాడినని అన్నారు. ఇక అమ్మాయి విషయం చాలా సున్నితమైనదని, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడిని స్టేషన్ కు తీసుకు వచ్చి అప్పగించాలని, అది తనకు మంచిదని హితవు చెప్పారు. దీని వల్ల సమస్య పెరగదన్నారు. పరిష్కారం దొరుకుతుందన్నారు సీఎం.
ఇదే సమయంలో తాను జెడ్పీటీసీగా ఉన్నప్పుడే సీఎం అవుతానని చెప్పానని, చేసి చూపించానని అన్నారు రేవంత్ రెడ్డి. ఇక 2034 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఆ తర్వాత వేరే వాళ్లకి అవకాశం ఇచ్చి.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన లక్ష్యమని ప్రకటించారు సీఎం. ఇక మరో పదేళ్ల పాటు తానే సుప్రీం అని ప్రకటించారు. తనను ఎవరూ దించలేరని పేర్కొన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ఇక తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత.. రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో తాను ఉంటానని తెలిపారు. అయితే తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదన్నారు.