YV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ

YV Subba Reddy : తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తయింది. గురువారం నాడు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. కల్తీ నెయ్యి విషయంలో భిన్న కోణాల్లో వైవీ సుబ్బారెడ్డిని విచారించారు. సుబ్బారెడ్డి (YV Subba Reddy) పీఏ అప్పన్న స్టేట్‌మెంట్‌తోపాటు టీటీడీ బోర్డ్ చైర్మన్ హోదాలో టెండర్ల నిబంధనల సడలింపుపైనా ప్రశ్నలు సంధించారు. ఈ విచారణ అనంతరం స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. మరోసారి అవసరమైతే విచారిస్తామని వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుని.. విచారణ చేపట్టింది. మధ్యాహ్నం భోజన విరామానికి ఆయనకు గంట సమయం ఇచ్చింది. అనంతరం మళ్లీ ఈ విచారణను కొనసాగించింది. దాదాపు 7 గంటలకు పైగా సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా గతంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులను విచారణలో భాగంగా వెల్లడించిన డాక్యుమెంట్లు, స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ విచారణను సిట్ అధికారులు చేపట్టారు. కాగా, సిట్ ప్రశ్నలతో సుబ్బారెడ్డి ఉక్కిరిబిక్కిరైనట్లు తెలుస్తోంది.

YV Subba Reddy – తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ (గురువారం) మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు.

ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచానూరులో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానికుల రాకపోకలను నిలిపివేశారు. దాంతో స్థానికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక తిరుచానూరు పర్యటన ముగించుకుని.. సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకుంటారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో సైతం పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

Also Read : YS Jagan: సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ ! బేగంపేటలో వైసీపీ శ్రేణుల ఘన స్వాగతం !

Leave A Reply

Your Email Id will not be published!