కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారింది. భారతీయ జనతా పార్టీ మరోసారి పవర్ లోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. ఒకవేళ పార్టీకి మెజారిటీ సీట్లు రాక పోతే ఇతర మార్గాల ద్వారా ఎలా సాధించాలనే దానిపై ఆలోచిస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి ఆర్. అశోక్ సంచలన కామెంట్స్ చేశారు. తమ పార్టీ ప్లాన్ ఏమిటో బయట పెట్టారు. ఒకవేళ మెజారిటీకి సంబంధించి సీట్లు రాక పోయినట్లయితే ప్లాన్ బి కూడా ఉందని స్పష్టం చేశారు ఆర్. అశోక్.
ఇదే సమయంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము నిజమైన రాజకీయ నాయకులమని , కానీ మౌనంగా ఉండేందుకు సాధువులం కామని పేర్కొన్నారు. ఇది రాజకీయం..ప్రతి దానికి ఓ ప్లాన్ అంటూ ఉంటుందన్నారు. దీని గురించి తాము ఆలోచిస్తున్నామని చెప్పారు ఆర్. అశోక్. ప్రస్తుతం బీజేపీ మంత్రి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
రేపటి ఫలితాలు వెలువడే లోపు ప్లాన్ బి ఏం చేయాలనే దానిపై స్కెచ్ వేశామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మొత్తం 224 సీట్లకు గాను 2,516 మంది బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు 140 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసింది. మరో వైపు రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు పన్నుతోంది బీజేపీ.
