ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 1 ను హైకోర్టు కొట్టి వేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కుతో పాటు స్వేచ్చగా తమ అభిప్రాయాలను తెలియ చేసుకునే హక్కు ఉంటుందని అభిప్రాయపడింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకోక తప్పదని పేర్కొంది. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించ కూడదంటూ జగన్ ప్రభుత్వం హడా వుడిగా చట్టం తీసుకు వచ్చింది. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో తమను కట్టడి చేసేందుకు ప్లాన్ చేసిందంటూ సీపీఐ నాయకుడు రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే ఏ చర్యను తాము సహించ బోమంటూ హెచ్చరించింది. ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి ఇది కోలుకోలేని షాక్.
తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఏపీలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నిర్ణయాన్ని తాము స్వాగితిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతలకు స్థానం లేదన్నారు. ఈ తీర్పుతో రుజువైందన్నారు చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యమే ఉన్నతమైనదని , అధికారం తెచ్చిన అహంకారానికి తావు లేదని రుజువైందన్నారు. ఇకనైనా జగన్ మారాలని సూచించారు.
