కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ చరిత్ర సృష్టించారు. ఆయన మరోసారి సత్తా చాటారు. భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఏకంగా లక్షకు పైగా మెజారిటీని పొందడం విశేషం. డీకే శివకుమార్ ను ఎలాగైనా సరే ఓడించాలని బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ముగ్గురు డీకేఎస్ ను అడ్రస్ లేకుండా చేయాలని అనుకున్నారు.
కానీ వర్కవుట్ కాలేదు. డీకే శివకుమార్ సామాజిక వర్గానికి చెందిన మంత్రిగా ఉన్న ఆర్. అశోక్ ను కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. కానీ అంచనాలు తప్పాయి. ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఒక రకంగా బీజేపీ త్రయానికి కోలుకోలేని దెబ్బ.
224 సీట్లకు గాను 130 సీట్లకు పైగా గెలుపొందే దిశగా పరుగులు తీస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీంతో పార్టీలో సంతోషం వ్యక్తమైంది. ఇక డీకే శివకుమార్ పోటీ చేసిన కనకపుర నియోజకవర్గంలో ఒక్కలి ఓట్లు నిర్ణయాత్మకంగా ఉన్నాయి. ఈ ఒక్క నియోజకవర్గంలో 2,24,956 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,90,124 మంది ఓటు వేశారు. రెండు దశాబ్దాల కిందట జేడీఎస్ కంచుకోటగా ఉన్న కనక్ పుర ఇప్పుడు డీకే శివకుమార్ పట్టులో ఉంది.
మొత్తంగా ఈ విజయం పార్టీకి అద్భుతమైన బలాన్ని ఇచ్చినట్లయింది. ప్రస్తుతం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య నువ్వా నేనా అన్న పోటీ నెలకొంది. ఎవరు సీఎం అవుతారనేది పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
