ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ). కీలక మార్పులు, సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఎండీ వీసీ సజ్జనార్ వచ్చాక ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన వచ్చాక కార్గో సర్వీస్ ఆరంభించారు. తాజాగా ప్రయాణీకులకు సంబంధించి ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నారు. ఇవి పర్యావరణ హితమైనవి.
హైదరాబాద్ విజయవాడ మార్గంలో 50 విద్యుత్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించింది టీఎస్ఆర్టీసీ. వీటిలో 10 బస్సులను మే 16 మంగళారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. మిగతా 40 బస్సులను ఈ ఏడాది చివరి నాటికి విడతల వారీగా తీసుకు వస్తుంది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రయాణీకులకు మెరుగైన , సౌకర్యవంతంగా ఉండేలా ఈ ఏసీ బస్సులను రూపొందించారు.
ఈ ఎలక్ట్రిక్ బస్సులకు ఈ -గరుడ గా టీఎస్ఆర్టీసీ సంస్థ పేరు పెట్టింది. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకు వీటిని నడపనుంది. రాబోయే 2 సంవత్సరాలలో కొత్తగా 1860 ఎల్టక్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ బస్ పాయింట్ వద్ద బస్సులను ప్రారంభించనున్నారు.
