సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవలే బెయిల్ పై బయట పడిన పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను 10 ఏళ్ల పాటు జైలులో పెట్టాలని పాకిస్తాన్ ఆర్మీ కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సందేశం ఇచ్చారు. తన చివరి రక్తపు బొట్టు వరకు న్యాయం కోసం , దేశం కోసం, ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు.
దేశ ద్రోహ నేరం కింద వచ్చే 10 ఏళ్ల పాటు తనను జైలులో ఉంచాలని ఈ దేశాన్ని శాసిస్తున్న సైనిక వ్యవస్థ యోచిస్తోందని మండిపడ్డారు. ఆయన ప్రధానంగా పాక్ ఆర్మీని టార్గెట్ చేశారు. తాను దిగి పోయేందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ జనరల్ చౌదరి అని ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్. ప్రస్తుతం లండన్ ప్లాన్ పాచిక పారలేదన్నారు. తాను జైలులో ఉన్న సమయంలో హింసను సాకుగా చూపి జైలులో ఉంచాలని అనుకున్నారంటూ ధ్వజమెత్తారు.
లాహోర్ లోని తన నివాసం నుంచే ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పోలీసులు మహిళలను అని చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్. ఈ క్రూరమైన మోసాలకు బానిసలవడం కంటే నాకు మరణమే ఉత్తమం అని ప్రకటించారు.
