కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. భారీ మెజారిటీ వచ్చినా ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సీఎం పదవిని ఆశిస్తున్న మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు కూడా ఛాన్స్ ఇవ్వాలని మరో నేత ముందుకు వచ్చారు. ఆయన ఎవరో కాదు పరమేశ్వర. దళితుడినే సీఎం చేయాలంటూ కొత్త నినాదం తెర పైకి రావడం కలకలం రేపింది.
ఒకవేళ సీఎం పదవికి తనను ఎంపిక చేస్తే దానిని స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు, మాజీ సీఎం డాక్టర్ జి. పరమేశ్వరను ఎంపిక చేసే ఆలోచనలో కూడా ఏఐసీసీ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆయన మద్దతుదారులు మంగళవారం కర్ణాటకలో భారీ ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఆయన ఫోటోలు, బ్యానర్లతో హల్ చల్ చేశారు. తమ నేతను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు.
దీనికి సంబంధించి మాజీ సీఎం పరమేశ్వర ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పార్టీ హై కమాండ్ గనుక తనకు ఛాన్స్ ఇస్తే వెంటనే సీఎం పదవిని చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారని, కానీ పార్టీ హై కమాండ్ నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని అన్నారు.
