YS Sunita Reddy: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా
గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన వైఎస్ వివేకా కుమార్తె సునీతా
YS Sunita Reddy : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‍ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి(YS Sunita Reddy) కలిశారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్‍కు వెళ్లిన సునీత… తన తండ్రి హత్యకేసుపై గవర్నర్‍కు ఫిర్యాదు చేశారు. నా తండ్రి వివేకాను అతి కిరాతంగా హత్య చేశారని, ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న పలువురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారని… ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ ఆమె గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను వివరించిన ఆమె… ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని గవర్నర్ ను కోరారు.
YS Sunita Reddy Meet
శనివారం వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ముందుగా పులివెందులలో అని సమాధి వద్ద సునీత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… నా తండ్రి హత్య జరిగి ఆరేళ్లు గడిచిపోయాయి, అయినా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంత సమయం గడిచినా సీబీఐ కోర్టులో కనీసం ట్రయల్ కూడా ప్రారంభించలేదు. ఈ కేసును సీబీఐ తిరిగి దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటున్నాను. అయితే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయి. వివేకాను చంపిన నిందితుల్లో ఒక్కరు మినహా అందరూ బెయిల్‍పై బయటే తిరుగుతున్నారు, సాక్షులు మాత్రం చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులను వాగ్మూలం వెనక్కి తీసుకోవాలంటూ నిందితులు హడలెత్తిస్తున్నారని సునీత చెప్పుకొచ్చారు. ఇన్నేళ్లయినా తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని, నిందితులకు కఠిన శిక్ష పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Minister Nara Lokesh: టీడీపీ కార్యకర్త దారుణ హత్య ! తీవ్రంగా ఖండించిన మంత్రి లోకేష్ !
