Shubhanshu Shukla: మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

మరోసారి వాయిదా పడ్డ శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర

Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. జూన్‌ 19న రోదసి యాత్ర ఉంటుందని తొలుత ఇస్రో (ISRO) ప్రకటించినప్పటికీ.. అది 22కు వాయిదా పడింది. ఇప్పటికే సాంకేతిక కారణాలతో యాక్సియం-4 ప్రయోగం పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌ కోసం ఉపయోగిస్తున్న ఫాల్కన్‌-9 రాకెట్‌ లో ధ్రవ ఆక్సిజన్‌ లీక్‌ అవుతున్నట్లు అధికారులు గుర్తించడంతో ఈనెల 11న జరగాల్సిన ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ సమస్య పరిష్కారమైనట్లు తెలిపిన ఇస్రో… 19న రోదసీ యాత్ర ఉంటుందని వెల్లడించింది. అయితే.. తాజాగా ఇది మరోసారి వాయిదా పడినట్లు ఇస్రో తెలిపింది.

Shubhanshu Shukla Special Journey

‘‘ప్రయోగ తేదీపై ఇస్రో బృందం యాక్సియం స్పేస్‌తో సుదీర్ఘ చర్చల జరిపింది. ప్రయోగ సంసిద్ధతపై నాసా, స్పేస్‌ ఎక్స్‌తో యాక్సియం స్పేస్‌ సంప్రదింపులు జరిపింది. ఇటీవల చేపట్టిన మరమ్మతులు, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జూన్‌ 22ను తదుపరి ప్రయోగ తేదీగా యాక్సియం స్పేస్‌ వెల్లడించింది’’ అని ఇస్రో తెలిపింది.

యాక్సియం-4 కింద మరో ముగ్గురు విదేశీ ఆస్ట్రోనాట్లతో కలిసి శుభాంశు (Shubhanshu Shukla) రోదసియాత్ర చేపట్టనున్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్‌’ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. ఈ స్పేస్ క్యాప్సూల్‌ను ఫాల్కన్‌-9 రాకెట్‌ నింగిలోకి మోసుకెళుతోంది. ఇందులో శుభాంశు మిషన్‌ పైలట్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రయోగం తొలుత మే 29న జరగాల్సిఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్య తలెత్తడం వంటి కారణాలతో పలుమార్లు వాయిదా పడుతోంది.

ఇక, భూమి నుంచి బయల్దేరిన 28 గంటల తర్వాత ఈ వ్యోమనౌక… అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌)తో అనుసంధానమవుతుంది. శుభాంశు బృందం అక్కడే 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో ముచ్చటిస్తారు.

Also Read : Air India Insurance: అహ్మదాబాద్ లో కూలిన విమానానికి రూ.4,000 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ ?

Leave A Reply

Your Email Id will not be published!