IndiGo: ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
IndiGo : ఇండిగో ఎయిర్ లైన్స్ ట్రైనీ పైలట్ ఒకరు సంచలన ఆరోపణలు చేసారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్‌లోని ఎయిర్‌లైన్స్ హెడ్‌క్వార్టర్స్ ఈ ఘటన జరగ్గా… పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
IndiGo Case
బెంగళూరుకు చెందిన శరణ్ కుమార్ (35) అనే ఇండిగో (IndiGo) ట్రైనీ పైలట్… ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లో జరిగిన మీటింగ్ కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్ తండ్రి అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదులో… ‘‘కాక్ పిట్లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్‌ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా… కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్ డే, మనిష్ సహానీ, రాహుల్ పాటిల్‌పై శరణ్ ఫిర్యాదు చేశారు.
అంతేకాదు తన కుమారుడి విషయంలో ఎయిర్‌లైన్స్ వాళ్లు దారుణంగా వ్యవహరించారని… ఈ విషయాన్ని ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ ఎథిక్స్ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన.
దీనితో ఈ ఘటనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్(హర్యానా)లోని కార్పొరేట్ ఆఫీస్ పరిధిలో కావడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు… గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్-1 పీఎస్‌కు కేసును బదిలీ చేశారు.
ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉండగా సాంకేతిక లోపం
ఎయిర్ ఇండియా (Air India) విమానాలకు సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ టూ జమ్మూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో సోమవారంనాడు సాంకేతిక లోపం తలెత్తింది. ఐఎక్స్2564 విమానం ఢిల్లీ నుంచి జమ్మూకు బయలుదేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిత లోపం గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ విమానం వెనక్కి రావడంతో ప్రత్యామ్నాయంగా జమ్మూకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
దీనికిముందు, ఆదివారంనాడు తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దు చేశారు. తిరువనంతపురంలో విమానం ల్యాండింగ్ కాగానే తనిఖీలు చేపట్టగా పక్షి ఢీకొట్టినట్టు గుర్తించారు. దీంతో ఢిల్లీకి షెడ్యూల్డ్ ప్రయాణాన్ని రద్దు చేశారు. కాగా, మూడు రూట్లులో ఎయిర్ ఇండియా సర్వీసులను రద్దు చేయడంతో పాటు 118 వీక్లీ ఫ్లైట్లను 19 రూట్లలో తాత్కాలికంగా తగ్గించినట్టు ఎయిర్ ఇండియా ఆదివారంనాడు ప్రకటించింది.
Also Read : Dangeti Jahnavi: అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి
