Pashamylaram: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం ! 12 మంది మృతి !
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం ! 12 మంది మృతి !
Pashamylaram : సంగారెడ్డి జిల్లాలోని పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని (Pashamylaram) సిగాచి పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా… మరో నలుగురు ఆచూకి లభ్యం కాలేదు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనితో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని.. వేడి గాలి అధిక ఒత్తిడి వల్లే భారీ పేలుడు సంభవించిందని ఇండస్ట్రీయల్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినప్పుడు పేలుడు సంభవించినట్లు తెలిపారు. వేడి గాలి తాకిడికి భవనం కుప్పకూలిందన్నారు. పేలుడు ధాటికి గోడలు బద్దలై పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్‌చార్జ్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. భవన శకలాలు చుట్టుపక్కల పరిశ్రమలోకి దూసుకెళ్లాయన్నారు. పరిశ్రమలో రియాక్టర్లు భద్రంగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు.
పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో దాదాపు 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ… మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
Pashamylaram – ప్రమాదంపై ఫైర్ డీజీ ఏమన్నారంటే ?
అలాగే ఈ ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మాట్లాడుతూ… సిగాచి పరిశ్రమలో ఉదయం 9:38 గంటలకు బ్లాస్టింగ్ జరిగిందన్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారన్నారు. డ్రయింగ్ యూనిట్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు పరిశ్రమలో ప్రధానంగా ఉంటాయని తెలిపారు. ఈ రెండు యూనిట్‌లలో ఏదో ఒక చోట సమస్య వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికుల సంఖ్యపై స్పష్టత లేదన్నారు. 35 మంది కార్మికులు క్షతగాత్రులు అయ్యారని… 12 మంది చనిపోయారని వెల్లడించారు. సమాచరం అందిన నిమిషం లోపే ప్రమాద స్థలికి చేరుకున్నామని.. సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు.
పాశమైలారం రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) రసాయన పరిశ్రమ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రియాక్టర్ పేలడంతో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా… పలువురు కార్మికులు ఇంకా పరిశ్రమలోనే చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమలోకి చొచ్చుకెళ్లేందుకు కార్మికుల కుటుంబాలు యత్నించాయి. తమవారి ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలోకి వారిని వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో కార్మికుల కుటుంబాల రోదనలు మిన్నంటుతున్నాయి.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనం బీటలు వారింది.
Also Read : Tantric Ritual: కుక్కల రక్తంతో యువతి క్షుద్ర పూజలు
