Nimisha Priya: నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు – మృతుడు తలాల్‌ మెహదీ సోదరుడు

నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు - మృతుడు తలాల్‌ మెహదీ సోదరుడు

Nimisha Priya : కేరళ నర్సు నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదని యెమెన్‌కు చెందిన మృతుడు తలాల్‌ మెహదీ సోదరుడు అబ్దుల్‌ ఫతా మెహదీ స్పష్టం చేశారు. 2017లో తలాల్‌ మెహదీని హత్య చేసిన కేసులో నిమిషప్రియకు యెమెన్‌ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆమెకు శిక్షను అమలు చేయాల్సి ఉండగా… దాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో మృతుడి సోదరుడు స్పందిస్తూ… నిమిషప్రియను క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఆమెకు మరణ శిక్షను అమలు చేయాలని కోరారు.

మరోవైపు నిమిషప్రియను (Nimisha Priya) కాపాడేందుకు భారత ప్రభుత్వం, కొన్ని సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మృతుని కుటుంబ సభ్యులను ఒప్పించడమే మత పెద్దలకు, అధికారులకు సవాలుగా మారింది. వారు అంగీకరిస్తే ఎంత మొత్తంలో ‘బ్లడ్‌ మనీ’ ఇవ్వాలన్న దానిపై చర్చలు జరపనున్నారు. బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.8.6కోట్ల) క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ (Nimisha Priya) కుటుంబం సిద్ధమైంది. ఇందుకు వారు అంగీకరిస్తే… నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. కాని మృతుని సోదరుడు ‘బ్లడ్‌ మనీ’కు అంగీకరించకపోవడం… ఇప్పుడు అటు యెమెన్… ఇటు భారత్ లో ఉత్కంఠ నెలకొంది.

Nimisha Priya – అసలేమిటీ కేసు ?

నిమిష ప్రియ (Nimisha Priya) నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్‌ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీనితో అక్కడి తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌ అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్‌ వచ్చిన ప్రియ అది ముగియగానే తిరిగి యెమన్‌ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు ప్రియ కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్‌, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్‌ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా… సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు.

Also Read : Akash Prime: భారత్ “ఆకాశ్‌ ప్రైమ్‌” క్షిపణి పరీక్ష విజయవంతం

Leave A Reply

Your Email Id will not be published!