CM Revanth Reddy: సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు – సీఎం రేవంత్
సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు - సీఎం రేవంత్
CM Revanth Reddy : బీఆర్ఎస్ కు ప్రజలు పదేళ్లు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదని… బుధవారం జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నాలుగు అంశాలకు పరిష్కారం లభించింది. మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించిందని అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ‘ఈ సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండు.. వీళ్లు గొడవ పడితే బాగుండు.. దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుంది..’ అని కొందరు ఎదురుచూశారని ఆయన ఎద్దేవా చేసారు. ‘‘వాళ్లనేం చేస్తాం? చూసి జాలిపడతాం. వాళ్ల బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మేము వాళ్ల కోసం లేము. తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు. సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత’’ అని స్పష్టం చేశారు.
CM Revanth Reddy Comments
దిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పాల్గొన్న అనంతరం బుధవారం ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఉత్తమ్ మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడం ఆహ్వానించదగిన పరిణామం. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ‘‘గోదావరి.. బనకచర్ల (Banakacharla) కడతామని వారు(ఏపీ) అడిగితే కదా… మేము ఆపమని చెప్పడానికి. ఆ ప్రతిపాదనే రానప్పుడు… ఆపమనే చర్చే రాదు. ఇది ఎపెక్స్ కమిటీ సమావేశం కాదు… దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించడానికి జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశం. కేంద్రం ఏ రాష్ట్రం పక్షానా నిలబడలేదు. ఏ ఎజెండాను కూడా సూచించలేదు. సమావేశంలో జలశక్తి మంత్రి పాటిల్ జడ్జి పాత్ర పోషించారు.
ఏపీ కడుతున్న ప్రాజెక్టుల మీద మేము ఇప్పటికే ఫిర్యాదులు చేశాం. మా ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు చెప్పాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే.. అన్ని రకాల అభ్యంతరాలు లేవనెత్తాయి కాబట్టి సమావేశంలో ఆ అంశాలు ప్రస్తావనకు రాలేదు.
CM Revanth Reddy – ఇది తెలంగాణ విజయం – సీఎం రేవంత్
మొత్తం తెలంగాణ (Telangana) హక్కులను కేసీఆర్… ఏపీకి ధారాదత్తం చేశారు. అన్యాయం చేశారు. వాటిని పరిష్కరించడానికి మేము విధి విధానాలను ముందుకు తీసుకొచ్చాం. ఇది తెలంగాణ రాష్ట్ర విజయం. ఎందుకంటే ఏపీ తనకు కేటాయించిన నీళ్ల కంటే ఎక్కువ వినియోగిస్తుందని మేము ఫిర్యాదు చేసిన నేపథ్యంలో… టెలీమెట్రీల ఏర్పాటుకు ఏపీ అంగీకరించింది. శ్రీశైలం డ్యామ్ నిర్వహణకు, మరమ్మతులకు, రక్షణకు కూడా ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఇది కూడా తెలంగాణ ప్రభుత్వ విజయమే. దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు గుర్తించడం కోసం కమిటీ ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. గతంలో ఎపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయా? పార్లమెంటులో చట్టం చేస్తేనే… ప్రధాని మోదీ అంగీకరించడం లేదు. అలా అనుమానించుకుంటూ పోతే ఏ అంశం పరిష్కారం కాదు. మేము నియమించిన కమిటీనే కదా.. ఆ కమిటీ సిఫార్సులను గౌరవిస్తాం. అంశాల వారీగా చర్చిస్తాం. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. చర్చిస్తున్నప్పుడు.. పోరాడాల్సిన అవసరం ఏముంది? అవసరమైనప్పుడు గల్లీ నుంచి దిల్లీ దాకా కొట్లాడతాం. అందుకు సిద్ధంగానే ఉన్నాం’’ అని రేవంత్ అన్నారు.
నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా అన్ని చోట్లా టెలీమెట్రీలు
‘‘కృష్ణా జలాలలో.. ఏపీ ఎన్ని వినియోగిస్తుంది.. తెలంగాణ ఎన్ని వినియోగిస్తుందనేది గుర్తించడానికి, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లెక్కలు తేల్చేందుకు… టెలీమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్నిచోట్ల టెలీమెట్రీలను ఏర్పాటుచేసింది. మిగిలిన అన్నిచోట్లా ఈ పరికరాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఇవ్వకపోయినా… తెలంగాణ ప్రభుత్వమే అన్నిచోట్లా టెలీమెట్రీ పరికరాలను యుద్ధప్రాతిపదికన పెట్టాలని నిర్ణయించాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
శ్రీశైలం డ్యామ్‌లో కొన్ని ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తక్షణం మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ సహా పలు సంస్థలు ఇచ్చిన నివేదికల్లోని అంశాలను భారత, ఏపీ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు, రక్షణ, నిర్వహణలకు సంబంధించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నట్లుగా.. 2020లో ఎపెక్స్ కౌన్సిల్లో అప్పటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. గోదావరి బోర్డు హైదరాబాద్‌లో.. కృష్ణా బోర్డు ఏపీలో ఏర్పాటుకు తుది నిర్ణయం జరిగింది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యలను గుర్తించడానికి, చర్చించడానికి, పరిష్కారానికి సీనియర్ అధికారులు, ఇంజినీర్లు, నిపుణులతో కమిటీని వారం రోజుల్లో నియమించాలని నిర్ణయించాం.
గోదావరి నది, దాని ఉపనదులు.. కృష్ణా నది, దాని ఉపనదులకు సంబంధించి అన్నీ చర్చకు వస్తాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు, ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో నిర్వహణలో అంశాలు, అభ్యంతరం ఉన్న ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, అనుమతులు.. అన్నీ ప్రస్తావనకు వస్తాయి. వీటన్నింటిపై 30 రోజుల్లో మన తరఫున అధికారులు, ఇంజినీర్లు, నిపుణులు కమిటీ గుర్తించి చర్చకు తీసుకొస్తారు. ఆ కమిటీలో చర్చించిన తర్వాత.. ముఖ్యమంత్రుల స్థాయిలో మరోసారి భేటీ అయి చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ సమావేశంలో కేవలం పెండింగ్ అంశాలపై మాత్రమే చర్చించాం. ముందు సమస్యలను గుర్తించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పరిష్కారంపై చర్చిస్తాం’’ అని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్, కె.రఘువీర్‌రెడ్డి, వంశీకృష్ణ, అభిషేక్ మను సింఘ్వీ, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, కడియం కావ్య, బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Nimisha Priya: నిమిషప్రియకు క్షమాభిక్ష ప్రసక్తే లేదు – మృతుడు తలాల్ మెహదీ సోదరుడు
