Drone Squadron: భారత్-పాక్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ‘డ్రోన్ స్క్వాడ్రన్’
భారత్-పాక్ సరిహద్దులో బీఎస్‌ఎఫ్ ‘డ్రోన్ స్క్వాడ్రన్’
Drone Squadron : ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పీవోకేతోపాటు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అటునుంచి దాయాది దేశం కూడా మనపై డ్రోన్లతో దాడులకు యత్నించింది. దీనితో భారత బలగాలు అప్రమత్తమయ్యాయి. భవిష్యత్తులో ఇటువంటి ప్రయత్నాలను దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా భారత్-పాక్ సరిహద్దులో గస్తీ పెంచడంతోపాటు ‘డ్రోన్ స్క్వాడ్రన్’ (Drone Squadron) లను ముమ్మరంగా మోహరించే పనిలో నిమగ్నమయ్యాయి.
Drone Squadron in India-Pakistan Border
సరిహద్దులో నిర్దిష్ట ఔట్ పోస్టుల్లో ఉండే డ్రోన్ దళాల్లో నిఘాకు సంబంధించి అనేక వ్యవస్థలు ఉంటాయి. ఈ స్క్వాడ్రన్‌లో నిఘాతోపాటు మానవరహిత విమానాలు లేదా డ్రోన్లు ఉంటాయి. ఈ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. చంఢీగఢ్ లోని బీఎస్‌ఎఫ్ వెస్టర్న్ కమాండ్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఈ బృందాలకు దిశానిర్దేశం చేస్తుంది. రక్షణ పరిశోధన, నిఘా సంస్థలతో ఈ బృందాలు కీలక వివరాలను పంచుకుంటాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ స్క్వాడ్రన్‌లో (Drone Squadron) చిన్న, భారీ స్థాయి నిఘా, నిఘా ప్రతిస్పందన డ్రోన్లు ఉంటాయి. ఆపరేషన్ సిందూర్‌లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు శత్రు డ్రోన్లపై దీటుగా విరుచుకుపడతాయి. ఒక చిన్న బృందంలో ఇద్దరు నుంచి ముగ్గురు సిబ్బంది ఉంటారు. ముప్పు అధికంగా ఉండే సరిహద్దు పోస్టుల వద్ద వీరిని మోహరిస్తారు. జమ్మూ నుంచి గుజరాత్ వరకు 2వేల కి.మీ మేర ఉన్న భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు భద్రత బాధ్యత బీఎస్‌ఎఫ్‌దే.
‘డ్రోన్ స్క్వాడ్రన్’తో పాటు బంకర్లూ బలోపేతం
భారత్‌లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ వేలాది డ్రోన్లతో దాడులకు తెగబడింది. జమ్మూలోని ఖార్కోలా సరిహద్దు పోస్టు వద్ద డ్రోన్‌లతో జారవిడిచిన బాంబు పేలి ఇద్దరు బీఎస్‌ఎఫ్ సిబ్బంది, ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోవడంతోపాటు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులనుంచి పాఠాలు నేర్చుకున్న సైన్యం… సరిహద్దులో సైనిక బలోపేతం, బలహీనతకు సంబంధించి విశ్లేషణల అనంతరం భద్రతను మరింత పెంచే ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో డ్రోన్ దాడులను తట్టుకునే విధంగా సరిహద్దు బంకర్ల పైకప్పు, గోడలను అల్యూమినియం షీట్లతో బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Also Read : Bihar Voter List: బిహార్ లో 52లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
