CM Chandrababu: దుబాయ్‌ని చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది – సీఎం చంద్రబాబు
దుబాయ్‌ని చూస్తుంటే నాకు అసూయ వేస్తుంది - సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్.. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ (AP) సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘దుబాయ్‌లో ఎడారి ప్రాంతాలు, బీచ్‌లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండటం సంతోషకరం.
సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. యూఏఈతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అక్కడి జనాభాలో 40శాతం మంది భారతీయులే. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్‌తో పరిస్థితి మారింది. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో భారత్‌కు అపార అవకాశాలు వచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించి రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచాం. రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తాం.
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నాం. ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మెరుగైన సాంకేతికతతో అద్భుతాలు సృష్టించే కాలమిది. ఆరోగ్యం, సంపద, సంతోషకర సమాజ స్థాపనే మా లక్ష్యం. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో రహదారుల వంటి అన్ని పనులు చేస్తున్నాం’’ అని తెలిపారు.
CM Chandrababu – ఏపీలోనే మొట్ట మొదటి హైడ్రోజన్ వ్యాలీ
‘‘కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం… పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్షిప్. లులు మాల్ అంతర్జాతీయంగా రిటైల్ కేంద్రాలు నిర్వహిస్తోంది. దావోస్‌లో నాలుగైదు సార్లు లులు మాల్ ప్రతినిధులను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరాం. విజయవాడ, విశాఖలో లులు మాల్స్ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే. గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా ఎగుమతులకు విశాఖ, కాకినాడకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. మొట్ట మొదటి హైడ్రోజన్ వ్యాలీ ఏపీనే. గ్రీన్ ఎనర్జీలో ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే గూగుల్ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆరోగ్య రంగంలోనూ బిల్‌గేట్స్ ఫౌండేషన్‌తో పనిచేస్తున్నాం.
సుందరమైన హరిత నగరంగా అమరావతిని నిర్మిస్తాం. ఈ ఏడాది 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షిస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం మార్చుకున్నాం. రాష్ట్రంలో మౌలిక వసతులకు ఎలాంటి కొరత లేదు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయి. నీటి వనరుల పరంగా, వ్యవసాయ రంగంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది’’ అని సీఎం వివరించారు. సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరై పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
దేశానికి ఏపీ ఈస్ట్రన్ ఫుడ్ కారిడార్‌గా, మెరైన్ ఎక్స్‌పోర్టర్‌గా ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఆక్వా ఉత్పత్తులతో పాటు పండ్ల ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ఏపీలో 9 మెగా ఫుడ్ పార్కులతో ఫుడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉందన్నారు. ‘‘ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు, 6 పోర్టులు ఉన్నాయి. విస్తృత మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. 38 మిలియన్ల మంది నైపుణ్యమున్న మానవ వనరులున్నాయి. యూఏఈకి ఏపీ నమ్మకమైన భాగస్వామిగా ఉంటుంది’’అని అన్నారు.
Also Read : Visakhapatnam: విశాఖకు మరో నాలుగు ప్రతిష్ఠాత్మక సంస్థలు
