Maoists Surrenders: డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు

డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్ర నేతలు

Maoists Surrenders : గత కొంతకాలంగా చత్తీస్ ఘడ్, జార్ఖండ్, తెలంగాణా రాష్ట్రాల్లో వరుస ఎదురుదెబ్బలు తిన్న మావోయిస్టులకు… ఏపీలో కోలుకోలేని దెబ్బ తగిలింది. సుమారు 34 ఏళ్ళుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన అగ్రనేతలుగా ఉన్న దంపతులు ఏపీ డీజీపీ హారీష్ గుప్తా (DGP Harish Gupta) ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలతో పాటు ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వాధీనం చేసుకున్న డంప్ వివరాలను వెల్లడించారు.

Maoists Surrenders In front of DGP

మావోయిస్ట్ పార్టీలో సుమారు 34 సంవత్సరాలకు పైగా పనిచేసిన సీనియర్ మావోయిస్టులు జోరిగె నాగరాజు అలియాస్ కమలేశ్, ఆయన భార్య మేడక జ్యోతీశ్వరి అలియాస్ అరుణ ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. కమలేశ్, ప్రస్తుతం తూర్పు బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్‌చార్జ్‌ గా పనిచేస్తూ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో SZCM హోదాలో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లో పలు ఆపరేషన్లలో వీరు కీలకంగా వ్యవహారించారు. మావోయిస్టు పార్టీ వైఫల్యాలు, కేంద్ర కమిటీ విధానాలపై విసుగు చెంది, ఈ సిద్ధాంతం ఇక చెలామణి అవ్వదని గ్రహించి లొంగిపోయినట్లు మావోయిస్టులు చెప్పారు. కమలేష్‌పై ఆంధ్రప్రదేశ్‌లో (AP) రూ.20 లక్షల రివార్డు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ గుప్తా (DGP Harish Gupta) మాట్లాడుతూ… లొంగిపోయిన మావోయిస్టు (Maoists) దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున చెక్కులను అందచేశామని తెలిపారు. అల్లురి సీతారామరాజు జిల్లాలో ఆపరేషన్ బృందాలు మావోయిస్టుల ఆయుధాలు, డంప్ స్వాధీనం చేసుకుందని చెప్పుకొచ్చారు. వీటిలో మొత్తం 18 ఆయుధాలు ఉన్నాయని… 1 AK-47, 2 BGLలు, 5 SLRలు, 2 INSAS రైఫిళ్లు, 606 లైవ్ రౌండ్లు, 37 కిలోల కార్డెక్స్ వైర్లు, ఇతర పరికరాలు ఉన్నాయని వెల్లడించారు. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇటీవల ప్రజల్లో బాగా చైతన్యం వచ్చిందని… పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు జాయింట్ ఆపరేషన్‌‌లు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఏపీ పోలీసులు ఫీల్డ్ లెవల్లో బాగా పని చేసి మంచి ఫలితాలు చూపించారని చెప్పుకొచ్చారు. వయలెన్స్ పోతేనే ఎక్కడైనా అభివృద్ధి సాధ్యమవుతుందని… అందుకే వీటి‌పై ప్రధానంగా దృష్టి పెట్టామని ఉద్ఘాటించారు. గతంలో లొంగిపోయిన మావోయిస్టులకి కూడా నేడు రివార్డులు అందజేస్తున్నామని ప్రకటించారు. మావోయిస్టులు పునరాలోచన చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాసూచించారు.

హింసాత్మక ఘటనలతో సాధించేదేమీ లేదని స్పష్టం చేశారు. ఏపీ ఇప్పుడు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉద్ఘాటించారు. మావోయిస్టులు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలని సూచించారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వస్తే… ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య కాలంలో ఐదుసార్లు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ఈ ఆపరేషన్లలో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందగా, వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్, ఏపీ మావోయిస్టు కమిటీ సభ్యులు అరుణ, జగన్, డివిజనల్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి రమేశ్ ఉన్నారని గుర్తుచేశారు. అలాగే వీరి నుంచి 8 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. UG కేడర్‌లో ఇప్పటివరకు నలభై ఏడుమంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పుకొచ్చారు. విధుల్లో అద్భుత ఫలితాలు సాధించిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు.

UG కేడర్‌లో పనిచేస్తున్న మావోయిస్టులు అందరూ లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తావిజ్ఞప్తి చేశారు. సరెండర్ పాలసీ ప్రకారం మావోయిస్టుల లొంగుబాటుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకరిస్తోందని అన్నారు. మావోయిస్టులపై ఉన్న రివార్డ్‌తో పాటు, ఇంటి స్థలం, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఇరవై మంది ఏపీ వారు ఉన్నారని గుర్తుచేశారు. అందులో అయిదు మంది SZCM హోదాలో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. మావోయిస్టులు తమకు లొంగిపోకుండా సోషల్‌ ప్రాబ్లమ్ అని‌ ఇంకా చెప్పడమనేది‌ సరి‌కాదని… ఏపీలో ఎక్కడా ఇప్పుడు మావోయిస్టులు లేరని తెలిపారు. ఏపీ అభివృద్ధిలో మావోయిస్టులు భాగస్వామ్యం కావాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.

Also Read : AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్ కసిరెడ్డి సంస్థల్లో సిట్ సోదాలు

Leave A Reply

Your Email Id will not be published!