Upendra Dwivedi: భారత సైన్యంలో కొత్త శక్తి ‘రుద్ర’
భారత సైన్యంలో కొత్త శక్తి ‘రుద్ర’
Upendra Dwivedi : శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యంలో శక్తివంతమైన దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రకటించారు. దీనికి ‘రుద్ర’ అనే పేరు పెట్టామని తెలిపారు. శనివారంనాడు ‘కార్గిల్ విజయ దివస్’ సందర్భంగా కార్గిల్‌లోని వార్ మెమెరోయిల్ వద్ద ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ… శత్రువుల ఆటకట్టించేందుకు, భవిష్యత్ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆల్ ఆర్మ్ బ్రిగేడ్… రుద్రను ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి శుక్రవారంనాడు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
Upendra Dwivedi Key Comments
‘రుద్ర’ యూనిట్‌లో పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి సేన, ప్రత్యేక దళాలు, మానవరహిత ఏరియల్ యూనిట్లు ఉంటాయని ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. సరిహద్దుల్లో శత్రువులు వణుకు పుట్టించేందుకు లైట్ కమెండో యూనిట్ ‘భైరవ్’ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పదాతిదళం ఇప్పుడు ఒక డ్రోన్ ప్లాటూన్ అని, ఆర్టిలరీలో శక్తిభాన్ రెజిమెంట్ ఉంటుందని, డ్రోన్, కౌంటర్-డ్రోన్, లోయిటరింగ్ మందుగుండు సామగ్రి వంటివి సన్నద్ధంగా ఉంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మన సామర్థ్యం అనేక రెట్లు పెరగనుందని, స్వదేశీ క్షిపణులతో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు.
ఈసందర్భంగా ఆపరేషన్ సిందూర్ గురించి ఆయన మాట్లాడుతూ… పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చామన్నారు. దేశ ప్రజల విశ్వాసం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఇది సాధ్యమైందన్నారు. మన ఐక్యత, సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి ఇది సరైన సమాధానం చెప్పిందన్నారు. పాక్‌లోని ఉగ్రమూకల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ దుందుడుకు చర్యలను కూడా అరికట్టామన్నారు. భారత్ నిర్ణయాత్మకమైన విజయం సాధించిందని వ్యాఖ్యానించారు.
Also Read : Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు
