Adaso Kapesa: ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్ గా అదాసో కపేసా !
ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్ గా అదాసో కపేసా !
Adaso Kapesa : దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత పొందే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఆయన్ను అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుతుంది. ఇటీవల మోదీ బ్రిటన్ పర్యటనలో భాగంగా ఓ ఫొటో వైరలైంది. ప్రధాని వెనుకాల ఉన్న మహిళా ఎవరనే విషయం ఆసక్తిగా మారింది. ఆమె పేరు అదాసో కపేసా. ఎస్పీజీలో తొలి మహిళా ఆఫీసర్‌గా ఘనత సాధించారు.
Adaso Kapesa – అదాసో కపేసా ఎవరంటే ?
అదాసో కపేసా (Adaso Kapesa) స్వస్థలం మణిపుర్ సేనాపతి జిల్లాలోని కైబీ గ్రామం. సశస్త్ర సీమా బల్ (SSB)లో చేరిన ఆమె… ఉత్తరాఖండ్ పిథోడ్గఢ్ లోని 55వ బెటాలియన్‌లో సేవలందించేవారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిణి అయిన ఆమె ఎస్పీజీలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులోకి ప్రవేశించడం ఆషామాషీ వ్యవహారం కాదు. యుద్ధ మెలకువలు, వ్యూహాత్మక నిఘా, హై సెక్యూరిటీ ప్రొటోకాల్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు అంశాల్లో కచ్చితత్వం కనబర్చిన కపేసా ఇందులో అడుగుపెట్టారు.
కఠినమైన ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భద్రతాదళాల్లో ఒకటిగా పేరుపొందిన ఎస్పీజీ (SPG) బృందంలో కపేసా ప్రవేశించడం వ్యూహాత్మకం, చరిత్రాత్మకంగానూ భావిస్తున్నారు. ముఖ్యంగా భద్రతా బలగాల్లో స్త్రీ, పురుష భేదం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. 1985లో ఎస్పీజీ ఏర్పాటైనప్పటి నుంచి ఓ మహిళా అధికారిణి ఇందులో విధులు నిర్వర్తించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రధాని బ్రిటన్ పర్యటనలో కపేసా విధుల్లో ఉండటంతో ఆమెపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిశాయి. ఆమె సరికొత్త ఘనత సాధించారని, శక్తికి ప్రతిరూపంగా, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ నెటిజన్లు స్పందించారు.
Also Read : Election Commission : మరో 476 పార్టీల రద్దుకు ఈసీ చర్యలు ! జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 26 పార్టీలు !
