India Post: అమెరికాకు అన్నిరకాల పోస్టల్‌ సేవలను నిలిపివేసిన భారత్‌

అమెరికాకు అన్నిరకాల పోస్టల్‌ సేవలను నిలిపివేసిన భారత్‌

India Post : ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా (USA)పై భారత్‌ సహా పలు దేశాలు పోస్టల్‌ (India Post) సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత తపాలాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా కస్టమ్స్‌ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్‌ వెల్లడించింది.

India Post Shocking America

100 డాలర్ల వరకూ విలువవున్న బహుమతులు, లేఖలు, డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఇటీవల ప్రకటించగా… తాజాగా అవి కూడా నిలిచిపోనున్నాయి. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా వీటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బుకింగ్‌ చేసిన పార్శిళ్లు చేరని పక్షంలో… పోస్టల్‌ ఛార్జీలను కస్టమర్లకు తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.

జులై 30వ తేదీన ట్రంప్‌ యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్టు 29వ తేదీ నుంచి 100 డాలర్లకుపైగా విలువున్న పార్శిళ్లపై అమెరికా కస్టమ్స్‌ సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం అంతర్జాతీయ పోస్టల్‌ నెట్‌వర్క్, అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ (సీబీపీ) విభాగం ఆమోదించిన ‘క్వాలిఫైడ్‌ పార్టీ’ల ద్వారా వస్తువులను రవాణాచేసే సంస్థలే సుంకాలు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఇందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై పూర్తి స్థాయి స్పష్టత లేకపోవడంతో అమెరికాకు విమానాలను నడిపే సంస్థలు తపాలా పార్శిళ్లను స్వీకరించడానికి నిరాకరించాయి. దీంతో పార్శిళ్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తపాలాశాఖ ప్రకటించింది. ఇదే కారణంతో దాదాపు 25 దేశాలు కూడా అమెరికాకు పోస్టల్‌ సర్వీసులను నిలిపివేశాయి.

Also Read : Pratibha Setu: యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ‘ప్రతిభా సేతు’ పోర్టల్ ఏర్పాటు

Leave A Reply

Your Email Id will not be published!