MP Mahua Moitra: అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీపై కేసు నమోదు
అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీపై కేసు నమోదు
MP Mahua Moitra : కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పై ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో కేసు నమోదైంది. ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1971 సమయంలో రాయ్‌పుర్‌లోని మానా క్యాంప్ ప్రాంతంలో అనేకమంది బంగ్లాదేశీ శరణార్థులు స్థిరపడ్డారని, మహువా వ్యాఖ్యలు వారిలో భయాందోళనలు రేకెత్తించాయని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 196, సెక్షన్ 197 కింద ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీనికి ముందు పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. మహువా (MP Mahua Moitra) అసహ్యకరమైన, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. ఇదే టీఎంసీ వైఖరా అని ప్రశ్నించింది. అయితే మహువా వ్యాఖ్యలపై టీఎంసీ అధికారికంగా స్పందించలేదు.
MP Mahua Moitra – అసలేం జరిగిందంటే ?
నదియా జిల్లాలో గత గరువారంనాడు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘సరిహద్దు భద్రత విషయంలో కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకొంటోంది. బీజేపీ నేతలు పదే పదే చొరబాటుదార్ల గురించి మాట్లాడుతున్నారు. అయితే.. దేశ సరిహద్దుల్ని పరిరక్షించే బాధ్యతను ఐదు భద్రతాదళాలు నిర్వర్తిస్తున్నాయి. అవన్నీ కేంద్ర హోంశాఖ పరిధిలోనే పనిచేస్తున్నాయి. కేంద్ర హోం శాఖ, హోం మంత్రి సరిహద్దుల్ని రక్షించలేకపోయినప్పుడు.. చొరబాటుదార్లు దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రధాని స్వయంగా చెప్పినప్పుడు.. ఆ తప్పు ఎవరిది?’’ అని ఆమె ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అమిత్ షాను ఉద్దేశించి ఆయన తలను నరికి బల్లపై పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Puri Jagannath Temple: పూరీ జగన్నాథ స్వామి ఆలయం పేరిట నకిలీ వెబ్‌సైట్
