Yamuna: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా నది

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న యమునా నది

Yamuna : ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. హరియాణాలోని మయునానగర్‌లోని హత్నికుండ్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. యమునా నది (Yamuna) ఉగ్రరూపం దాల్చడంతో.. దేశ రాజధాని పరిధిలోని పలు ఇళ్లలోకి మంగళవారం ఉదయం నీరు చేరింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుండడంతో యమునా తీర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు వరద హెచ్చరికను జారీ చేశారు. మంగళవారం తెల్లవారుజామున యమునా నది (Yamuna) 205.33 మీటర్ల డేంజర్‌ మార్క్‌ దాటడంతో దేశ రాజధానిలో భారీ వరదలు పోటెత్తే అవకాశం ఉందని దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే ఖాళీ చేసి, ప్రభుత్వం ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు చేరుకోవాలని సూచించింది.

Yamuna River in Danger

సోమవారం హరియాణాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి మూడు లక్షలకు పైగా క్యూసెక్కులు విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగినట్లు తెలుస్తోంది. హత్నికుండ్‌ నుంచి విడుదలయ్యే నీటివల్ల సాధారణంగా 36 నుంచి 48 గంటల్లో నగరం మొత్తం వరదల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని.. పరిస్థితులను పర్యవేక్షించడానికి దిల్లీ యంత్రాంగం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేఖా గుప్త పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రంలోగా యమునా నది 206 మీటర్ల ఎత్తుకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో పలు కార్యాలయాలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. పలు పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Yamuna – గురుగ్రామ్‌ లో 20 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్‌

సోమవారం కురిసిన భారీ వర్షంతో గురుగ్రామ్‌ అతలాకుతలం అయ్యింది. గురుగ్రామ్‌ ట్రాఫిక్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలను మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించుకోవచ్చని, అలాగే ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులు బాటు కల్పించాలని కంపెనీలకు అధికార వర్గాలు సూచించాయి. రోడ్ల మీద భారీగా నీరు చేరడంతో జనాలు తీవ్ర అవస్థలు పడ్డారు. మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ద్వారాకా ఎక్స్‌ప్రెస్‌ వే సర్వీస్‌ లేన్‌పై భారీగా వరద నీరు చేరడంతో మూసేశారు.

దిల్లీ-జైపుర్ హైవేపై 7 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌

భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో దిల్లీ రోడ్లు జలమయమయ్యాయి. దిల్లీ-జైపుర్ హైవేపై 7-8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. దాదాపు 3 గంటలకు పైగా ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు దిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read : Rats: ఐసీయూలో ఇద్దరు శిశువులను కరిచిన ఎలుకలు

Leave A Reply

Your Email Id will not be published!