Minister Kondapalli Srinivas: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం – మంత్రి కొండపల్లి
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం - మంత్రి కొండపల్లి
Kondapalli Srinivas : దావోస్ వేదిగా జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నామని, త్వరలో రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహరాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బ్రాండ్ అని, ఆయన్ను చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతున్నారని కొనియాడారు. విజయనగరంలోని తమ క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
MInister Kondapalli Srinivas Key Comments
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) మాట్లాడుతూ… ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో ప్రపంచ దేశాలను, పెట్టుబడుదారులను ఆకర్షించడంలో సఫలీకృతం అయ్యామని మంత్రి అన్నారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో జరిగిన సదస్సులో కూడా సత్ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేవిధంగా భరోసాను నింపిందని అన్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే సుమారు 11 లక్షల కోట్ల పెట్టుబడులు సిద్దంగా ఉన్నాయని, ఇవన్నీ కార్యరూపం దాల్చి ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
యువతకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దీనిలో భాగంగానే గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో పెట్టుకొని ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మొత్తం 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని, వీటిలో ఇప్పటికే 50 పార్కులకు శంకుస్తాపన చేయడం జరిగిందని, త్వరలో మరికొన్నింటికి శంకుస్తాపన చేస్తామని తెలిపారు. 11పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు కూడా జరుగుతోందని అన్నారు. రక్షణ రంగం, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని వివరించారు.
మెడికల్ కాలేజీలపై వైసీపీ దుష్ప్రచారం
మెరుగైన వైద్య సదుపాయాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించే లక్ష్యంతోనే వైద్య కళాశాలలను పిపిపి పద్దతిలో నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయం, పోర్టులు, జాతీయ రహదారులు, భారీ ప్రాజెక్టులను పిపిపి పద్దతిలో నిర్మిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వ హాయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయ్యిందని, మౌలిక సదుపాయాల కల్పన పడకేసిందని మంత్రి చెప్పారు. తమ పార్టీ హాయంలోనే గతంలో కూడా రాష్ట్రానికి అత్యధికంగా మెడికల్ సీట్లు వచ్చాయని చెప్పారు. ఆరోగ్య భీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని, దీనివల్ల ప్రతీఒక్కరికీ ఆరోగ్య భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో తాము ముందునుంచీ ఒకే విధానంలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీకి ఈ విషయంలో స్పష్టత లేదని, రోజుకో మాట చెబుతోందని అన్నారు.
ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం శుభకరమని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్‌ను అమలు చేశామని, రాష్ట్ర ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. అనంతపురంలో జరిగిన భారీ సభే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రానికి 50వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుందని మంత్రి చెప్పారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధిక ంగా యూరియాను వినియోగించడం మంచిది కాదని అన్నారు. కేన్సర్, కిడ్నీ సమస్యలు తదితర వ్యాధుల విజృంభనకు కొంతవరకు అధిక యూరియా కారణమై ఉండవచ్చునని అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన మేరకు మాత్రమే యూరియాను వినియోగించాలని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగను మునుపటి ఏడాదివలే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు.
Also Read : BJP President JP Nadda: వైసీపీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు – జేపీ నడ్డా
