Medha School: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Medha School : డబ్బు సంపాదనే లక్ష్యంగా మత్తు మందును తయారు చేసి విక్రయిస్తున్న మేధ స్కూల్ (Medha School) కరస్పాండెంట్ జయప్రకాశ్ గౌడ్‌ను (Jayaprakash Goud) అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్ కోర్టులో హాజరుపరిచింది. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గుడా జైలుకు తరలించారు. కోర్టుకు ఈగల్ టీమ్ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో అనేక సంచలన విషయాలు ఉన్నాయి.
Medha School Drugs Case
స్కూల్‌ని (Medha School) అడ్డం పెట్టుకొని మత్తుమందు తయారు చేసి విక్రయించానని, స్కూల్లో మత్తుమందు తయారుచేస్తే ఎవరికీ అనుమానం రాదనే ఫ్యాక్టరీ పెట్టానని జయప్రకాశ్ గౌడ్ అంగీకరించాడు. గురువారెడ్డి అనే వ్యక్తి దగ్గర్నుంచి ఫార్ములాని కొనుగోలు చేశానని, ఆరు సార్లు మత్తుమందు తయారు చేయడంలో ఫెయిల్ అయ్యానని జయప్రకాశ్ గౌడ్ వెల్లడించాడు. ఏడోసారి సక్సెస్ అయిన తర్వాత కల్లులో మత్తు మందును కలిపి ఇచ్చానని, ఆ డ్రగ్‌తో కిక్కు రావడంతో వినియోగారులు హ్యాపీగా ఫీలయ్యారని చెప్పాడు.
రోజుకు కిలో చొప్పున మత్తు మందుని తయారు చేశానని… తయారు చేసిన మొత్తం డ్రగ్‌ను స్కూటీ పైన తీసుకువెళ్లి సప్లై చేశానని జయప్రకాశ్ అంగీకరించాడు. పగటిపూట స్కూల్ తరగతులు నడిపించి రాత్రి మత్తు మందు తయారు చేశానని, మత్తుమందు తయారు చేసే ఫ్లోర్లో పిల్లలకు ట్యూషన్లు మాత్రమే చెప్పానని తెలిపాడు. తాను తయారు చేసిన డ్రగ్‌ను మహబూబ్ నగర్‌తో పాటు హైదరాబాదులోని పలు కల్లు కాంపౌండ్లకి సప్లై చేశానని అంగీకరించాడు.
మేధా పాఠశాల విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆందోళన
అల్ప్రాజోలం తయారీ కేసులో సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాలను అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఈ సమాచారం తెలియక సోమవారం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చారు. పాఠశాల సీజ్ అయినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. టీసీ ఇస్తే ఇతర పాఠశాలలో చేర్పించుకుంటామని తెలిపారు. పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేయడం దారుణమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలకు 70 శాతం ఫీజులు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే?
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మలేల జయప్రకాశ్‌గౌడ్(39) హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి సాయికాలనీలో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో మేధా పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో అల్ప్రాజోలం తయారీ దందాకు తెరలేపాడు. తయారీ ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి ఇచ్చాడు. స్కూలు రెండో అంతస్తులోని రెండు గదుల్లో పరికరాల సాయంతో తయారుచేసి, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న ఈగల్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు చేసింది. జయప్రకాశ్‌గౌడ్, అతడికి సహకరిస్తున్న బోయిన్‌పల్లికి చెందిన పెంటమోల్ ఉదయ్ సాయి(23), గౌటె మురళి(23)లను అదుపులోకి తీసుకుంది. ఆదివారం అధికారులు పాఠశాలను సీజ్ చేశారు.
Also Read : Vijay: రజినీ కాంత్ పై విజయ్ అభిమానుల ఆగ్రహం
