Election Commission: ఓట్లు తొలగింపుపై రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ
ఓట్లు తొలగింపుపై రాహుల్ ఆరోపణలను ఖండించిన ఈసీ
Election Commission : సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఖండించింది. అదంతా నిరాధార, అసత్య ప్రచారమని వెల్లడించింది. ఆన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓటు తొలగించడం లేదు.. ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరు. 2023లో అలంద్ అసెంబ్లీ నియోజవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. ఆ వ్యవహారంపై దర్యాప్తు కోసం ఎన్నికల సంఘమే ఫిర్యాదు చేసింది. రికార్డుల ప్రకారం… అలంద్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్ నేత బీఆర్ పాటిల్ గెలుపొందారు’’ అని ఈసీ వెల్లడించింది.
Election Commission – రాహుల్ గాంధీ ఆరోపణలపై బీజేపీ ఆగ్రహాం
రాహుల్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని బీజేపీ దుయ్యబట్టింది. ‘‘రాహుల్కు రాజ్యాంగం, చట్టం అర్థం కావడం లేదు. 2014 నుంచి మోదీజీ సాధిస్తున్న విజయాలన్నీ నిజం కాదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజలకు, ఓటర్లకు అవమానం. ఆయన బాంబు గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని మాజీ కేంద్రమంత్రి రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘‘హైడ్రోజన్ బాంబు పేలుస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. ఆ బాంబ్ ఇలాగే ఉంటుందా..? వాళ్లు ఓటమిని చవిచూస్తున్నారు. ఈ సమయంలో వారు చేయాల్సింది దానిని అంగీకరించడం. కష్టపడి మీ స్థాయికి వస్తామనేలా వారి మాటలు ఉండాలి. అంతేకానీ దానికి బదులుగా వారు కోర్టుల జోక్యాన్ని కోరుకుంటున్నారు. లేకపోతే వేరొకరిపై నిందలు వేస్తున్నారు’’ అని దిల్లీ మంత్రి మజీందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు.
బంగ్లాదేశ్, నేపాల్ తరహా అశాంతి భారత్లో సృష్టించాని రాహుల్ భావిస్తున్నారని కమలం పార్టీ నేత అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓటమి చవిచూసిందని, దాంతో ఆయన అసహనం రోజురోజుకూ పెరుగుతోందని ఎద్దేవా చేశారు. క్షమాపణలు కోరడం, కోర్టు మందలింపులు ఆయనకు పరిపాటిగా మారిపోయాయని అన్నారు.
Also Read : Nara Lokesh: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు
