Rahul Gandhi: కర్ణాటక సీఐడీకి ఈసీ సమాచారం ఇవ్వడం లేదు – రాహుల్
కర్ణాటక సీఐడీకి ఈసీ సమాచారం ఇవ్వడం లేదు - రాహుల్
Rahul Gandhi : లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ కర్ణాటక ‘ఓటు చోరీ’ వ్యవహారానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ)పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఓటు చోరీపై దాఖలైన కేసు విచారణలో భాగంగా కర్ణాటక సీఐడీకి అడిగిన సమాచారాన్ని ఈసీ అందించలేదని ఆయన ఆరోపించారు. తన తల్లి సోనియా గాంధీతో కలిసి వయనాడ్ పర్యటనకై విచ్చేసిన ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) అయిన జ్ఞానేశ్ కుమార్ సీఐడీ పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.
‘‘సీఈసీ తీరుపై ఇంతకు మించిన అభిశంసన ఇంకేం కావాలి. ఆయన పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వడం లేదు. ఇది నేను చేస్తున్న ప్రకటన కాదు. ఇది వాస్తవం’’ అని రాహుల్ అన్నారు. ‘‘వాస్తవాలను బహిర్గతం చేసే హైడ్రోజన్ బాంబును త్వరలోనే పేల్చబోతున్నాం. మేం చెప్పే విషయాలపై బలమైన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. సాక్ష్యాలు లేకుండా మేమేదీ చెప్పడం లేదు’’ అని రాహుల్ (Rahul Gandhi) స్పష్టం చేశారు.
Rahul Gandhi – మోదీ బలహీన ప్రధాని రాహుల్ గాంధీ విమర్శలు
‘‘మోదీ అత్యంత బలహీన ప్రధాని’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు గుప్పించారు. హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల రుసుము విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న అనంతరం రాహుల్ (Rahul Gandhi) ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లో ప్రధానిని బలహీనుడు అంటూ చేసిన పోస్టునే తిరిగి ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు. విదేశాల్లో భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టలేకపోతున్నారని దుయ్యబట్టారు. దీంతోపాటు హెచ్-1బీ వీసా నిర్ణయంపై వచ్చిన కథనాన్ని ఆయన ఈ పోస్టుకు జత చేశారు.
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘మీ ప్రియ మిత్రుడి (ట్రంప్) నుంచి అందిన పుట్టిన రోజు రిటర్న్ గిఫ్ట్ (హెచ్-1బీ వీసా రుసుము) చూశాక భారతీయులు చాలా బాధ పడ్డారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.కాగా, హెచ్-1బీ వీసాల రుసుమును లక్ష డాలర్లకు పెంచేయడంతో అమెరికా ఆవిష్కరణల రంగాన్ని స్వయంగా ఆ దేశ ప్రభుత్వమే గొంతు నొక్కినట్లైందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాల్లోని ప్రతిభ తమ దేశంలోకి రాకుండా అమెరికా తలుపులు మూసుకుంది. తద్వారా వచ్చేతరం ల్యాబ్‌లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్లకు మళ్లించింది.
అమెరికా నష్టం.. భారత్‌కు లాభం’ అంటూ ఎక్స్‌లో అమితాబ్ కాంత్ పోస్టు చేశారు. ట్రంప్ నిర్ణయంపై పలువురు అమెరికా చట్టసభల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం అత్యంత నిర్లక్ష్యపూరితమైనదని, దాని వల్ల అమెరికా ఐటీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బ తింటుందని హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించేందుకు ఇతర దేశాలు పోటీ పడుతున్న తరుణంలో అమెరికా వలస విధానాన్ని మరింత పటిష్ట పర్చాలే గానీ, బలహీన పర్చొద్దని హితవు పలికారు.
Also Read : Justice NV Ramana: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో మాజీ సీజేఐ ఎన్వీ రమణ భేటీ
