CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ! నలుగురి మృతి !

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ! నలుగురి మృతి !

CM Chandrababu : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న పరిస్థితులను సీఎం అడిగి తెలుసుకున్నారు. గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం కలెక్టర్ వివరించారు. ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో పడిన భారీ వర్షాల కారణంగా వంశధారకు 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు.

CM Chandrababu Key Instructions

భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా… ఆయన విచారం వ్యక్తం చేశారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం (CM Chandrababu) ఆదేశించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షం లేదని, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో నదుల్లో వరద ఉందన్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలాయని, ఇప్పటికే 90 శాతం కూలిన చెట్లను తొలగించామని చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 90 శాతం మేర విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని ఈపీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం లోగా అన్ని ప్రాంతాల్లోనూ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

CM Chandrababu – వరద పరిస్థితులపై హోంమంత్రి అనిత ఆరా

భారీ వర్షాలతో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగిన నేపథ్యంలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత వరద పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని… ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వరద సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు.

వంశధార, నాగావళి నది లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని ఆదేశించారు. విపత్తుల సమాచారం, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. విపత్తుల సంస్థ హెచ్చరిక సందేశం వచ్చినప్పుడు ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచనలు చేశారు.

మరోవైపు వంశధార నది పరివాహక ప్రాంతంలో దిగువున ఉన్న గ్రామ ప్రజలకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రకటించారు. వంశధార నదికి గొట్ట బ్యారేజ్ వద్ద దిగువకు 1,04,891 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం తెలియజేయాలని కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు.

Also Read : Inter Exam: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Leave A Reply

Your Email Id will not be published!