మహబూబ్‌నగర్ : సంస్కారం, సమాజం పట్ల అవగాహన, బాధ్యత కలిగిన విద్యా బోధనే విద్యార్థులను విజయ తీరాలకు చేరుస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడంలో తల్లిదండ్రుల ప్రేమ, గురువుల మార్గదర్శకత్వం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో నూతనంగా నిర్మించనున్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్ భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మన సంస్కృతిలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు.. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నదే మన తొలి పాఠం. అమ్మ ప్రేమలో ఆప్యాయత కనిపిస్తే, నాన్న ప్రేమ మౌనంగా ఉంటూనే మనల్ని ఉన్నత శిఖరాలకు నడిపిస్తుందని అన్నారు దామోదర రాజ నరసింహ.
తల్లిదండ్రుల ప్రేమ, గురువుల మార్గదర్శకత్వం.. ఈ రెండూ కలిస్తేనే విజయం మీ సొంతమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి రెడ్డి అనే ఐఐఐటీ విద్యార్థి మాట్లాడుతూ.. తనకు ఐఏఎస్ అధికారి కావడం లక్ష్యమని, జిల్లా వెనుకబాటుతనాన్ని పారద్రోలడమే తమ బాధ్యత అని తెలిపాడు. మీ జీవితంలో స్ఫూర్తి ఎవరని మంత్రిని ప్రశ్నించగా మంత్రి బదులిస్తూ తల్లిదండ్రులు, గురువులే నా స్ఫూర్తి. కేవలం పుస్తక జ్ఞానమే కాదు.. విజ్ఞత, సంస్కారం కలిగినప్పుడే విద్యార్థి పరిపూర్ణుడవుతాడు. సమాజంలో మీరు ఒక భాగం, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందంటూ స్పష్టం చేశారు.
