హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో కీలకమైన వ్యక్తిగా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అధికారులు సూచించిన సమయానికి చేరుకున్నారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 కింద సంతోష్ రావు కు నిన్న నోటీసులు జారీ చేసింది సిట్. రాక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. దీనిపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఇదే క్రమంలో విచారణకు ఆదేశించింది. ప్రత్యేకంగా దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావు, మాజీ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావులను విచారించింది. బావా బామ్మర్దులను ఏకంగా 7 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపించింది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కింగ్ పిన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు జోగినపల్లి సంతోష్ రావు. అన్నీ తానై వ్యవహరించాడు. కోట్లకు పడగలు ఎత్తాడని ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురిపై అక్రమ కేసులు బనాయించినట్లు విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం పవర్ లో లేక పోవడంతో మనోడు సైలెంట్ అయి పోయాడు. కాగా దర్యాప్తు సమయంలో ఫోన్-ట్యాపింగ్ కేసు సంబంధిత కొన్ని వాస్తవాలు సంతోష్ రావు కు తెలుసని స్పష్టమైందని, అందుకే ఆయనను విచారించాల్సిన అవసరం ఏర్పడిందని సిట్ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ ఫలితం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం డిసెంబర్ 21న కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన తర్వాత దర్యాప్తు వేగవంతమైంది.
