హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి ఉన్నట్టుండి స్వరం పెంచారు. ఆయన నిన్నటి దాకా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సర్కార్ కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. కొంత సమయం ఇస్తే పాలన గాడిలో పడుతుందని నమ్మారు. ఆపై కొంత సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. తీరా ఇచ్చిన హామీలు నెరవేరక పోవడం, రెండేళ్ల కాలం పూర్తయిన వెంటనే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం వ్యక్తం కానుండడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. మంగళవారం టీజీఎస్ చీఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే చాలా కష్టమని అన్నారు. తాము చెప్పిన సూచనలను పట్టించుకోక పోతే మిత్రపక్షం నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీపై పోరాడాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కోదండ రాం రెడ్డి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మాజీ ప్రొఫెసర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని వాపోయారు. తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా కోర్టులోనే ఉందంటూ ఆవేదన చెందారు కోదండ రాం రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు గురించి కూడా చర్చలు జరపలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూస్తుందని, దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం నుండి బయటకు వచ్చి వారిపై పోరాటం చేయాల్సి వస్తుందన్నారు.
