అమరావతి : ఏపీ విద్యా శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన, పేపర్‌లెస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో సర్కార్ మన మిత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మన మిత్ర వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్ఫారంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు)ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత సులభమైన సేవలు అందుబాటులోకి వచ్చాయని కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు తమ మొబైల్ ఫోన్ ద్వారా 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని పంపించాలని సూచించారు. ఇందులో ఉద్యానవన శాఖ (APMIP)ను ఎంపిక చేసుకొని సబ్సిడీ కోసం నమోదు చేయాలన్నారు. దరఖాస్తు స్థితి తెలుసు కోవడం, గ్రీవెన్స్ నమోదు , నాన్-సబ్సిడీ చెల్లింపులు వంటి కీలక సేవలను ఇంటి నుంచే పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.
హార్టికల్చర్ శాఖలో రైతులకు అందుతున్న సేవలు మరింత సులభతరంగా మారాయని, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ సిస్టమ్‌లు, సోలార్ పంపులు వంటి ఇరిగేషన్ పరికరాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యంతో పాటు నగదు చెల్లింపులు కూడా సురక్షితంగా ఇంటి నుంచే చేయగల అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు కింజారపు అచ్చెన్నాయుడు. ఈ డిజిటల్ సేవల వల్ల రైతుల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మన మిత్ర ప్లాట్ఫారం వినియోగం రైతుల్లో మరింత విస్తరించేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న దూరదృష్టి నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టం చేశారు.