న్యూఢిల్లీ : ఓ వైపు తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతుండగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ ఎన్ ఫోర్స్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యి కల్తీ కుంభకోణాన్ని దర్యాప్తు చేయడానికి గాను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లేదా నిందితులు సృష్టించిన అక్రమ నిధులను దర్యాప్తు చేయడానికి ఫెడరల్ దర్యాప్తు సంస్థ కొంతకాలం క్రితం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇటీవల సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, పత్రాలు , ఛార్జిషీట్‌ను ఈడీ పరిశీలిస్తోందని వెల్లడించింది.
ఈ కేసులో తొమ్మిది మంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు టీటీడీ పాలక మండలి లోని నిపుణులు సహా 36 మందిని సిట్ నిందితులుగా పేర్కొందని తెలిపింది. సిట్ నివేదికప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సంస్థకు నెయ్యిగా విక్రయించిన అసలు పదార్థం రసాయనికంగా ప్రాసెస్ చేయబడిన పామోలిన్ నూనె , ఇతర పదార్థాలు వాడారంటూ పేర్కొంది. మనీలాండరింగ్ , నెయ్యి కల్తీ ద్వారా నిందితులు అక్రమ నిధులను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న అంశాలను ఈడీ పరిశీలిస్తోందని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులు హవాలా లావాదేవీలు, నిధుల మళ్లింపులో పాల్గొన్నారని ఏజెన్సీ అనుమానిస్తున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2024లో రాష్ట్రంలో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పాలనలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపించారు.