ద‌మ్ముంటే వైసీపీ చ‌ర్చ‌కు రావాలి : నారా లోకేష్

వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారింది

అమరావతి : వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు ఏపీ రాష్ట్ర వైద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందని నిలదీశారు. శుక్ర‌వారం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ముందుగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అన్న కాంటీన్లు మూసి వేయబోమని సభలో చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవంటూ నీతులు చెబుతున్నారని ఎత్తి చూపారు.

దీనిపై మంత్రి లోకేష్ సీరియ‌స్ గా స్పందించారు. మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవని చెబుతున్నారు. 2020- 2021 ఏడాది క్యూ-4 పెండింగ్ 683.1 కోట్లు, 2023-24 క్యూ-2, క్యూ-3, క్యూ-4 బకాయిలు 1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే.. ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ చూస్తే సుమారు రూ.895 కోట్లు బకాయిలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించినట్లు సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేదు. నేను రికార్డెడ్ గా చెబుతున్నానని, విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు నాకు హక్కు ఉందన్నారు లోక‌ష్‌. వైసీపీ రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి వెళ్లారు. దీనిని నేను టేబుల్ చేస్తాను. మీరు రెడీగా ఉన్నారా అని వైసీపీ సభ్యులను నిలదీశారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. వైసీపీ హయాంలో రూ.4 వేల కోట్ల బకాయిలు లేవని, రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఇంటర్ విద్యను పట్టించు కోవడం లేదన్నారు. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!