తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

రోజుకు 60 వేల మంది భక్తులు ఉచిత బస్సుల్లో ప్రయాణం

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచి చూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు సగటున 300 ట్రిప్పులు నిర్వహిస్తూ, ఒక్కో ట్రిప్పు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది

బస్సుల ప్రత్యక్ష స్థానం, వచ్చే సమయాన్ని డిజిటల్ డిస్ప్లే ద్వారా భక్తులకు తెలియ జేయడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రోజుకు సుమారు 60 వేల మంది భక్తులు ఈ ఉచిత బస్సు సేవలను వినియోగిస్తూ సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారు. గతంలో ఉచిత బస్సు వచ్చే సమయం ముందుగా తెలియక పోవడంతో భక్తులు ప్రైవేట్ ట్యాక్సీల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపేవారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్లు భక్తుల నుండి అధిక ధరలను వసూలు చేసేవారు. ఈ సమస్యను గుర్తించిన టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకుని తిరుమలలోని 20 బస్టాప్ లలో బస్సుల ప్రత్యక్ష సమయం తెలిసేలా డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!